పవన్ ను బీజేపీ నేతలు భయపెడుతున్నారు - టీడీపీ సీనియర్ నేత..!!
టీడీపీ - జనసేన పొత్తును బీజేపీ అడ్డుకుంటోందా. టీడీపీ సీనియర్ నేత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ప్రధాని మోదీ విశాఖ పర్యటన సమయంలోనే ఇదే రకమైన చర్చ సాగుతోంది. పవన్ ను టీడీపీ వైపు వెళ్లకుండా బీజేపీ ఆపే ప్రయత్నాలు చేస్తోందనే వాదన ఉంది. టీడీపీతో పొత్తు దిశగా ఇప్పటికే పవన్ సంకేతాలు ఇచ్చారు. కానీ, స్పష్టమైన ప్రకటన మాత్రం చేయలేదు. ఢిల్లీ యాత్రలోనూ టీడీపీతో సహా కలిసి వెళ్లే ప్రతిపాదన చేసారని చెబుతున్నారు. బీజేపీ దీని పైనా స్పష్టత ఇవ్వలేదు. ఈ సమయంలోనే టీడీపీ సీనియర్ నేత చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
టీడీపీతో కలవనీయకుండా : మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేసారు. రాష్ట్రంలో బీజేపీ తప్పుడు రాజకీయం చేస్తోందని ఆరోపించారు. పవన్ కల్యాణ్ టీడీపీతో కలవటానికి ముందుకు వస్తుంటే బీజేపీ భయపెడుతోందని వ్యాఖ్యానించారు. టీడీపీతో జనసేన కలవనీయకుండా బీజేపీ ఎంత కాలం అడ్డుకుంటుందో చూస్తామని హెచ్చరించారు. బీజేపీ తెర ముందు ఒక రాజకీయం, తెర వెనుక ఒక రాజకీయం చేస్తోందని మండిపడ్డారు.
రాష్ట్రంలో బీజేపీ ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ వెనుక నుంచి జగన్ కు మద్దతు ఇస్తోందని చెప్పుకొచ్చారు. రానున్న రోజుల్లో ఈ రాష్ట్రానికి, దేశానికి బీజీపీ అవసరమా అని ప్రశ్నించే రోజు వస్తుందని చెప్పుకొచ్చారు. ఇప్పుడు పితాని వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇది పార్టీ అభిప్రాయమా లేక పితాని వ్యక్తిగత అభిప్రాయమా అనే కోణంలో చర్చ మొదలైంది.

బీజేపీ నేతలతో పవన్ భేటీతో : కొద్ది రోజుల క్రితం జనసేనాని పవన్ బీజేపీ ముఖ్య నేతలతో ఢిల్లీలో సమావేశమయ్యారు. టీడీపీతోనూ కలిసి వెళ్దామని ప్రతిపాదన చేసారు. దీని పైన బీజేపీ నేతల నుంచి స్పష్టత రావాల్సి ఉంది. అటు టీడీపీ నేతలు సైతం బీజేపీతో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అధికారంలోకి రావటం లక్ష్యంగా ఆలోచన చేస్తున్న టీడీపీ, జగన్ కు బీజేపీ నుంచి సహకారం లేకుండా చేయాలని భావిస్తోంది.
బీజేపీ నేతల నుంచి మాత్రం ఇప్పటి వరకు సానుకూల స్పందన రాలేదు. టీడీపీతో పొత్తు ఉండదని పలు సందర్భాల్లో బీజేపీ జాతీయ నేతలు చెబుతూ వచ్చారు. కర్ణాటక ఎన్నికల తరువాత తెలంగాణ రాజకీయాలపైన బీజేపీ ఫోకస్ చేయనుంది. ఆ సమయంలో పొత్తుల వ్యవహారం పైన క్లారిటీ వస్తుందనే అంచనాలు ఉన్నాయి.

బీజేపీ పవన్ ను నియంత్రిస్తుందా : వచ్చే ఎన్నికల్లో తమకు - పవన్ కు పొత్తు ఉంటుందని బీజేపీ నేతలు పదే పదే చెబుతున్నారు. అటు పవన్ మాత్రం తొలుత మూడు ప్రత్యామ్నాయాలు అని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఢిల్లీ పర్యటన తరువాత టీడీపీతో పొత్తు పైన తేల్చే విధంగా పవన్ అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ తన ప్రతిపాదనకు ఓకే చెబితే మూడు పార్టీల కూటమి..లేదంటే టీడీపీ - జనసేన పొత్తు ఖాయమనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి.
ఈ క్రమంలోనే అటు బీజేపీ పైన టీడీపీ వ్యాఖ్యలు మొదలైనటలు కనిపిస్తోంది. పవన్ కు మద్దతుగా ..బీజేపీకి వ్యతిరేకంగా టీడీపీ నేతల వ్యాఖ్యలు రానున్న రోజుల్లో ఏపీలో రాజకీయంగా కొత్త సమీకరణాలకు కారణమయ్యే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications