కేసీఆర్ బిజీ, విద్యుత్ సమస్యపై చర్చించ లేదు: గోయల్
న్యూఢిల్లీ: త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 24 గంటల విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. బుధవారం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఢిల్లీ, రాజస్దాన్ రాష్టాల్లో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
దేశవ్యాప్తంగా విద్యుత్ సరఫరాను మెరుగుపరుస్తున్నామని, ఏ ఒక్క రాష్ట్రపైనా వివక్ష చూపడం లేదని స్పష్టం చేసారు. ఐతే విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోని కొంత మంది ముఖ్యమంత్రులే విద్యుత్ విషయంలో కేంద్రంతో సరిగా స్పందించడం లేదని పరోక్షంగా తెలంగాణ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

మొత్తం 17 రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు తనను కలిసి ఆయా రాష్ట్రాల్లో విద్యుత్ సరఫరా గురంచి చర్చించారని, కాబట్టి ఆయా రాష్ట్రాలకు ప్రధమ ప్రాధాన్యం ఇస్తున్నామని ఆయన స్పష్టం చేసారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ చాలా బిజీగా ఉన్నట్లున్నారని, అందుకే ఆయన విద్యుత్ విషయంపై తనతో చర్చించలేదన్నారు.
తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి ఒకరు మాత్రం తనని కలిశారన్నారు. అలాగే మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రులు తనని కలవలేదని వివరించారు. దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో విద్యుత్ కొరత ఉందని దానిని పరిష్కరించేందుకు ప్రాధాన్యత క్రమంలో చర్యలు తీసుకుంటామన్నారు. రాజకీయాలతో సంబంధం లేకుండా విద్యుత్ రంగంలో సంస్కరణలతో ముందుకు వచ్చే ఏ రాష్ట్రాల ప్రతిపాదనలనైనా స్వాగతిస్తామన్నారు.
కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు తమకు ఓటేయని ప్రాంతాలకు కరెంట్ కట్ చేస్తామని బెదిరిస్తూ ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయన్నారు. ఈ విషయంలో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోదని గోయల్ తెలిపారు.












Click it and Unblock the Notifications