ఆ రైతులకు రాజధానిలో ప్లాట్లు: అయినా ఒప్పుకుంటారా?... ఉత్కంఠ
అమరావతి: గన్నవరం విమానాశ్రయ విస్తరణకు భూములు ఇచ్చిన రైతులకు అమరావతి రాజధాని ప్రాంతంలో ప్లాట్ల కేటాయింపునకు రంగం సిద్ధమైంది.ప్లాట్ల కేటాయింపునకు సంబంధించి సీఆర్‌డీఏ అధికారులు ముసాయిదా డ్రాఫ్ట్ గురువారం రాత్రి విడుదల చేశారు.
కృష్ణాజిల్లా అధికారిక వెబ్‌సైట్, సీఆర్‌డీఏ వెబ్‌సైట్‌లలో డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను అందుబాటులో ఉంచారు. ప్లాట్ల వివరాలను జాబితాల వారీగా పొందుపరిచారు. దీంతో పాటు లే అవుట్ కాపీని కూడా అందుబాటులో ఉంచారు. కేటగిరీల వారీగా రెసిడెన్షియల్, కమర్షియల్ ప్లాట్లను చూపించారు. అయితే భూముల కేటాయింపుతో సహా పలు అంశాలపై రైతులు తీవ్ర అసంతృప్తితో ఉన్న నేపథ్యంలో తాజా భూ కేటాయింపులపై ప్రభుత్వం రైతులు స్పందన కోసం చూస్తోంది.

భూములు ఇచ్చారు...కానీ
గన్నవరం మండలంలోని అజ్జంపూడి, అల్లాపురం, బుద్దవరం, చిన అవుటపల్లి గ్రామాలకు చెందిన మొత్తం 950 మంది రైతులు 837.69 ఎకరాల భూములను ఇచ్చారు. నిబంధనల ప్రకారం అమరావతి రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు ఎలాంటి ప్యాకేజీని ప్రభుత్వం ప్రకటించిందో అదే ప్యాకేజీని విమానాశ్రయ విస్తరణకు భూములు ఇచ్చిన రైతులకు కూడా కల్పించాల్సి ఉంది. గన్నవరం ఎయిర్‌పోర్టును అంతర్జాతీయ స్థాయికి తీసుకురావటానికి, అభివృద్ధి చేయటానికి తాము ఎంతో సహకరించామని, తమ సమస్యలను పరిష్కరించే విషయంలో మాత్రం సీఆర్‌డీఏ అధికారుల తీరు సరిగా లేదని రైతులు కొంతకాలంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్లాట్ల కేటాయింపులో తీవ్ర జాప్యం చేయటం, ఈ కాలంలో కౌలు కూడా ఇవ్వకపోవడంతో ఇటీవలే గన్నవరం రైతులు ఆందోళన బాట పట్టారు.

ఎమ్మెల్యే కృషి...ఎట్టకేలకు కొలిక్కి
ఈ క్రమంలో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ అసంతృప్తితో ఉన్న రైతులతో మాట్లాడి వారిని శాంతింపచేసి చర్చలకు సిఎం చంద్రబాబు దగ్గరకు తీసుకు వెళ్లారు. ఈ సందర్భంగా రైతులు సీఆర్‌డీఏ అధికారులు తమను పట్టించుకోవటం లేదని, ప్లాట్ల గురించి అడుగుతుంటే ఎక్కడో ముక్కలు ఇస్తామని చెబుతున్నారని సిఎంకు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా కౌలు గురించి అడుగుతుంటే ఇదిగో, అదిగో అంటున్నారని సీఎంకు చెప్పారు. అమరావతి రాజధాని నిర్మాణానికి జరీబు భూములు ఇచ్చిన రైతులకు ఇచ్చిన చోటే మాకు కూడా ఇస్తారని మీరే హామీ ఇచ్చారని, అయితే సీఆర్‌డీఏ అధికారులు తమకు భూములు ఎక్కడో ఇస్తామని భయపెడుతున్నారని చెప్పారు. దీనిపై సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించి తాను సీఆర్‌డీఏ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించటానికి తక్షణం చర్యలు తీసుకుంటానన్నారు. ఆ ప్రకారం సిఎం సీఆర్‌డీఏ అధికారులతో మాట్లాడటంతో భూముల కేటాయింపు జరిగింది.

కేటాయింపులు...కేటగిరీలు
గన్నవరం ఎయిర్ పోర్ట్ విస్తరణకు భూములు ఇచ్చిన రైతులకు పిచ్చికపాలెం, తుళ్ళూరు, శాఖమూరు, మాల్కాపురం, వెలగపూడి, ఐనవోలు, మందడం, నవులూరు, కురగల్లు గ్రామాలలో ప్లాట్లు చూపటం జరిగింది. రెసిడెన్షియల్ ప్లాట్స్‌లలో ఏ, బీ, సీ, డీ, ఈ, వీ1, వీ 2 కేటగిరీలుగా 6,58,210 చదరపు గజాల విస్తీర్ణంలో మొత్తం 856 ప్లాట్లను, కమర్షియల్ ప్లాట్ల శ్రేణిలో జీ1, హెచ్, ఐ, జే, కే, ఎల్, ఎం కేటగిరీలుగా 2,84,000 చదరపు గజాల విస్తీర్ణంలో మొత్తం 610 ప్లాట్లకు సంబంధించి వివరాలను పొందు పరిచారు.

రైతుల స్పందన కోసం...నిరీక్షణ
సిఎం సిఆర్డీఏ అధికారులతో మాట్లాడటంతో గన్నవరం విమానాశ్రయ విస్తరణకు భూములు ఇచ్చిన రైతులకు ప్లాట్ల కేటాయింపు మార్గం సుగమం అయింది. ప్రభుత్వం నోటిఫికేషన్ నేపథ్యంలో రైతులు నెల రోజుల లోపు తమ అభ్యంతరాలను సీఆర్‌డీఏ అధికారులకు తెలిపాల్సి ఉంటుంది. సీఆర్‌డీఏ నోటిఫికేషన్‌ను జిల్లా వెబ్‌సైట్‌లో ఉంచామని, గన్నవరం తహసీల్దారు కార్యాలయంలో కూడా ఉంచామని రైతులు పరిశీలించుకోవాల్సిందిగా కలెక్టర్ బి.లక్ష్మీకాంతం తెలిపారు. అభ్యంతరాల స్వీకరణ తర్వాత లాటరీ విధానంలో ప్లాట్లను కేటాయించటం జరుగుతుంది. ముక్కలుగా ఇవ్వవద్దని ఇప్పటికే గన్నవరం రైతులు నిక్కచ్చిగా స్పష్టం చేస్తున్న నేపథ్యంలో తమ అభిప్రాయాలు ఎలా ఉన్నాయో రైతుల స్పందన కనీసం కొన్ని రోజులు వేచి చూస్తేనే కానీ తెలిసే అవకాశం లేదు.












Click it and Unblock the Notifications