ఏపీకి ఒకేసారి ప్రధాని మోడీ-అమిత్ షా..! తిరుపతిలో టూర్ ఖరారు..!
ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi), కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) ఏపీకి రానున్నారు. డిసెంబర్ 4 నుంచి మూడు రోజుల పాటు తిరుపతిలో జరిగే జాతీయస్దాయి డీజీపీలు, ఐజీపీల సదస్సులో వారు పాల్గొంటారు. ఈ మేరకు ప్రధాని, అమిత్ షా టూర్ ఖరారైనట్లు ఏపీ ప్రభుత్వానికి సమాచారం అందింది. దీంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ ఇవాళ ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేసి కీలక ఆదేశాలు ఇచ్చారు.
తిరుపతిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (IISER)లో డిసెంబర్ 4 నుండి 6 వరకు డీజీపీలు , ఐజీపీల జాతీయ స్థాయి సదస్సు జరగనుంది. ఈ కార్యక్రమానికి మోడీ, అమిత్ షా వస్తున్నారు. వీరితో పాటు ఇతర ప్రముఖులు కూడా హాజరు కాబోతున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను సమీక్షించేందుకు, సచివాలయంలో ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ ఆధ్వర్యంలో అంతర్-శాఖ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. మూడు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సు కోసం విస్తృత ఏర్పాట్లు చేయాలని, ఏయే శాఖలు ఏయే బాధ్యతలు చేపట్టాలో ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు. సంబంధిత శాఖల కార్యదర్శులు మరియు ఇతర అధికారులు ఇప్పటి నుండే ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన కోరారు.

ఈ సదస్సుకు మోడీ,షాలతో పాటు వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన డీజీపీలు, ఐజీపీలతో సహా 200 మందికి పైగా ఐపీఎస్ అధికారులు, సుమారు 200 మంది ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు, రాష్ట్ర, కేంద్ర భద్రతా దళాల ప్రతినిధులు, జాతీయ భద్రతా సలహాదారు, కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారులు వస్తున్నట్లు సీఎస్ తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ సదస్సులో మొదటి రెండు రోజులు పాల్గొనే అవకాశం ఉన్నందున, విస్తృత ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. తిరుపతి నగరాన్ని సుందరీకరించడంతో పాటు ఇతర అవసరమైన ఏర్పాట్లను అత్యంత జాగ్రత్తగా చేపట్టాలని సంబంధిత శాఖలకు సూచించారు. అలాగే, సదస్సు జరిగే ప్రదేశంలో ఎటువంటి అంతరాయం లేని కనెక్టివిటీ కోసం ప్రత్యేక నెట్‌వర్క్ టవర్‌ను ఏర్పాటు చేయాలని ఐటీ శాఖ అధికారులను ఆదేశించారు.














Click it and Unblock the Notifications
