అచ్యుతాపురం పేలుడుపై ప్రధాని మోదీ ఆరా: ఎక్స్‌గ్రేషియా ప్రకటన
Atchutapuram blast: అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం అచ్యుతాపురంలో గల ఫార్మా సెజ్‌లో సంభవించిన ఘోర ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరిగింది. ఇప్పటివరకు 18 మంది మరణించారు. 50 మందికిపైగా కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటం వల్ల మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
అచ్యుతాపురం ఫార్మా సెజ్‌లోని ఉన్న ఎసెన్షియా అడ్వాన్స్డ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో బుధవారం మధ్యాహ్నం ఈ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. మధ్యాహ్నం భోజన విరామ సమయంలో ఈ కంపెనీలో రియాక్టర్ ఒక్కసారిగా పేలిపోయింది. ఆ వెంటనే మంటలు చెలరేగాయి. ప్రమాదం సంభవించిన సమయంలో కంపెనీలో సుమారు 400 మంది కార్మికులు విధుల్లో ఉన్నట్లు చెబుతున్నారు.

ఏడుమందికి పైగా కార్మికులు సంఘటన స్థలంలోనే దుర్మరణం పాలయ్యారు. పేలుడు ధాటికి కార్మికుల మృతదేహాలు ఛిద్రం అయ్యాయి. చెల్లాచెదురు అయ్యాయి. పేలుడు ధాటికి ఈ కంపెనీ కప్పు పైభాగం కింద పడటం వల్ల పలువురు కార్మికులు దాని కింద చిక్కుకున్నారు. గాయపడ్డ వారి హాహాకారాలతో ఘటనా స్థలం అంతా భీతావహంగా మారింది.
ఈ దుర్ఘటనపై గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. తక్షణమే సహాయక చర్యలు చేపట్టేలా ఆదేశాలు ఇచ్చారు. గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందించాలని అన్నారు. రియాక్టర్ పేలుడు ఘటన దురదృష్టకరమని పేర్కొన్నారు.
అచ్యుతాపురం పేలుడు ఘటనలో పలువురు కార్మికులు మరణించడం పట్ల వైఎస్ఆర్సీపీ అధినేత, వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతిని గురయ్యారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలియజేశారు. గతంలో తమ ప్రభుత్వం ఎల్జీ పాలిమర్స్ బాధితులను ఆదుకున్న తరహాలోనే ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.
ఈ ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆయన పోలెండ్ పర్యటనలో ఉన్నారు. అక్కడి నుంచే ఈ ఘటన వివరాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటన తనను కలిచివేసిందని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు సంతాపాన్ని, సానుభూతిని తెలియజేశారు.
ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి మృతుల కుటుంబాలకు రెండు లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు ప్రధాని మోదీ. గాయపడ్డ వారికి 50 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేయాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. గాయపడ్డ వాళ్లంతా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.












Click it and Unblock the Notifications