జగన్ పై చంద్రబాబు అస్త్రాన్ని నిర్వీర్యం చేసిన మోదీ..!!
ఏపీలో ఎన్నికల వేడి రాజుకుంది. జగన్ ఓటమి లక్ష్యంగా ఎన్డీఏ కూటమి రంగంలోకి దిగింది. మరో వైపు వామపక్షాలతో కలిసి కాంగ్రెస్ ఎన్నికల్లొ పోటీ చేస్తోంది. సీఎం జగన్ సింగిల్ గానే పోటీ చేస్తున్నారు. ఈ సమయంలో ఏపీలో కూటమి జోష్ పెంచేందుకు ప్రధాని మోదీ సభ ఏర్పాటు చేసారు. ఈ సభలో ప్రధాని మోదీ ప్రసంగం రాజకీయంగా అనేక సందేహాలకు కారణమవుతోంది. చంద్రబాబు, పవన్ వ్యూహాలకు భిన్నంగా ప్రధాని ప్రసంగం కొనసాగింది.
మోదీ ప్రసంగంలో
ప్రధాని తన ప్రసంగంలో ఎక్కడా చంద్రబాబు నాయకత్వం ఏపీకి అవసరమని చెప్పలేదు. ఇదే విషయం ఇప్పుడు టీడీపీ కేడర్ కు నచ్చటం లేదు. ఒక్క సందర్భంలో మినహా చంద్రబాబు, పవన్ ప్రస్తావన చేయలేదు. అసలు తెలుగుదేశం, జనసేన అనే పేర్లు ప్రధాని నోట వినిపించ లేదు. జగన్ ను టార్గెట్ చేస్తున్నట్లు కనిపించ లేదు. ఏపీకి సంబంధించి ఏ అంశం పైన హామీ ఇవ్వలేదు.

అమరావతి గురించి అసలు ఎత్తలేదు. పోలవరం, విశాఖ స్టీల్ ప్లాంట్ ఊసే లేదు. కానీ, ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ, కాంగ్రెస్ రెండూ ఒక్కటేనని ప్రధాని వ్యాఖ్యానించారు. ఆ రెండు పార్టీలు కలిసి ఓట్లను చీల్చేందుకు వేర్వేరుగా ఉన్నట్లు వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. రెండు పార్టీల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండి ఓట్లు చీలకుండా జాగ్రత్త పడాలని సూచించారు.
కాంగ్రెస్ - వైసీపీ ఒక్కటేనంటూ
కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీఏ సర్కార్ రాష్ట్రాన్ని శరవేగంగా అభివృద్ధి చేస్తామని, మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో నీలి విప్లవం తీసుకొస్తామని చెప్పారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినప్పుడే.. వికసిత భారత్‌తో పాటు, వికసిత ఆంధ్రప్రదేశ్ సైతం సాధ్యమవుతుందని మోదీ స్పష్టం చేసారు.
షర్మిల తన అన్న జగన్ తో విభేదించిన సమయం నుంచి చంద్రబాబు ఆ అంశాన్ని తనకు అనకూలంగా మలచుకొనే ప్రయత్నం చేసారు. వైఎస్ వివేకా హత్య కేసులో పోరాటం చేస్తున్న సునీతకు మద్దతుగా నిలబడాలని పిలుపునిచ్చారు. సొంత చెల్లినే జగన్ పట్టించుకోవటం లేదని చంద్రబాబు, పవన్ ఆరోపించారు. షర్మిల విమర్శలను ప్రతీ సందర్భంలోనూ ప్రస్తావిస్తూ జగన్ ను ఇరకాటంలోకి నెట్టేలా వ్యవహరిస్తున్నారు.
చంద్రబాబుకు నష్టమేనా
షర్మిల చేస్తున్న వ్యాఖ్యల ద్వారా జగన్ మరింత డామేజ్ అవుతారని చంద్రబాబు అంచనాగా చెబుతున్నారు. అయితే, చంద్రబాబు - పవన్ వ్యూహాలకు భిన్నంగా ప్రధాని మోదీ కాంగ్రెస్ - వైసీపీ సంబంధాల గురించి చేసిన వ్యాఖ్యలతో ఒక్క సారిగా వారి వ్యూహం కొత్త టర్న్ తీసుకుంది. ఈ అంశంలో మోదీ, చంద్రబాబు, పవన్ మధ్య సమన్వయం కొరవడినట్లు స్పష్టం అవుతోంది. చంద్రబాబు, పవన్ తన ఎన్నికల ప్రచార సభల్లో వివేకా హత్య అంశాన్ని ప్రస్తావన చేస్తున్నారు.
ఇప్పుడు మోదీ చేసిన వ్యాఖ్యలతో ఇక నుంచి షర్మిలను సమర్ధిస్తూ చంద్రబాబు, పవన్ మాట్లాడే అవకాశం ఉండదని భావిస్తున్నారు. ఇదే సమయంలో ఇప్పటి వరకు చంద్రబాబు చేసిన ఆరోపణలకు విలువ లేకుండా పోతుందనే అభిప్రాయం కనిపిస్తోంది. ఒక విధంగా జగన్ పైన చంద్రబాబు పోరాటంలో ఒక అస్త్రం మిస్ అయినట్లేననే విశ్లేషణలు మొదలయ్యాయి.












Click it and Unblock the Notifications