ఏపీపై వారణాశిలో జోస్యం చెప్పిన చంద్రబాబు
Chandrababu Naidu: నాలుగో దశలో ఏపీ, తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో 96 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ ముగిసింది. ఇక అయిదో విడతపై దృష్టి సారించింది కేంద్ర ఎన్నికల కమిషన్. 20వ తేదీన ఈ ఎన్నికలు షెడ్యూల్ అయ్యాయి.
బిహార్, జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్, లఢక్, మహారాష్ట్ర, ఒడిశా, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లల్లో 49 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ ఉంటుందా రోజున. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సొంత నియోజకవర్గం ఉత్తరప్రదేశ్‌లోని వారణాశి స్థానానికి చివరి విడతలో అంటే జూన్ 1వ తేదీన పోలింగ్ జరుగనుంది. దీనికి సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది.

నేడు మోదీ తన నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు. ఇప్పటికే ఆయన వారణాశికి చేరుకున్నారు. దశాశ్వమేధ ఘాట్‌లో గంగానదికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. క్షేత్రపాలకుడు కాలభైరవుడు, కాశీ విశ్వనాథుడిని దర్శించుకున్న అనంతరం మోదీ నామినేషన్ పత్రాలను దాఖలు చేస్తారు.
ఇక్కడి నుంచి వరుసగా మూడోసారి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారాయన. 2014, 2019 నాటి ఎన్నికల్లో వారణాశి నుంచి భారీ మెజారిటీతో గెలిచారు. 2014లో ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున పోటీ చేసిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, 2019లో సమాజ్‌వాది పార్టీ అభ్యర్థి షాలిని యాదవ్‌ను ఓడించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఎన్డీఏలో భాగస్వామ్య పక్షాల నాయకులకు ఆహ్వానం అందింది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కూ ఆహ్వాన పత్రాలు అందాయి. వారిద్దరూ వారణాశికి చేరుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు చంద్రబాబు. నరేంద్ర మోదీ నామినేషన్ దాఖలు కార్యక్రమాన్ని చారిత్రాత్మక ఘట్టంగా అభివర్ణించారు. అందులో తాము భాగస్వామ్యులం కావడం అదృష్టమని చెప్పారు. చారిత్రాత్మక నగరం వారణాశిలో.. నేడు మరో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కాబోతోందని పేర్కొన్నారు.
కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి రావడం ఖాయమని జోస్యం చెప్పారు చంద్రబాబు. మోదీ మరోసారి ప్రధానమంత్రి అవుతారని, ఈ దేశానికి దిశానిర్దేశం చేస్తారని అన్నారు. 10 సంవత్సరాలుగా మోదీ దేశానికి సుస్థిర పరిపాలన అందిస్తోన్నారని కితాబిచ్చారు. 2047 నాటికి వికసిత భారత్‌ను సాధించాలనే లక్ష్యంతో ఉన్నారని ప్రశంసించారు.
ఏపీ ఎన్నికల్లో సైతం ఎన్డీఏ కూటమి క్లీన్ స్వీప్ చేస్తుందని తేల్చి చెప్పారు. ఆ ధీమా తనకు ఉందని వ్యాఖ్యానించారు. నూటికి నూరు శాతం క్లీన్ స్వీప్ చేయబోతోన్నామని పేర్కొన్నారు చంద్రబాబు. 25 లోక్‌సభ నియోజకవర్గాలను కూడా ఎన్డీఏ కూటమి గెలుచుకుంటుందని అన్నారు.












Click it and Unblock the Notifications