చంద్రబాబు, జగన్ తో మోదీ మార్క్ రాజకీయం - అజెండా క్లియర్..!!
ఏపీలో ఎన్నికల రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. జగన్ ఓటమి లక్ష్యంగా ఏపీలో మూడు పార్టీలు కూటమిగా పోటీ చేస్తున్నాయి. ఏపీలో ఎన్డీఏ కూటమిగా ఉన్న మూడు పార్టీలు తొలి సభ నిర్వహించాయి. ఈ సభలో ప్రధాని మోదీ ఏం చెబుతారనే ఆసక్తి కనిపించింది. మోదీ సభ పైన చంద్రబాబు, పవన్ భారీ ఆశలు పెట్టుకున్నారు. జగన్ పైన ఎలా స్పందిస్తారని ఉత్కంఠగా చూసారు. కానీ, ప్రధాని తన మార్క్ రాజకీయం ఏంటో మరోసారి చూపించారు.
మోదీ వ్యూహం వెనుక
ఎన్నికల సమయంలో ప్రధాని మోదీ ఏపీలో మరోసారి తన రాజకీయం ఎలా ఉంటుందో స్పష్టం చేసారు. 2019 ఎన్నికల ముందు చంద్రబాబు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు. ఆ సమయం నుంచి తిరిగి ఇప్పుడు టీడీపీ ఎన్డీఏలో చేరే వరకూ ప్రధానితో సీఎం జగన్ సత్సంబంధాలు కొనసాగించారు. ఇప్పుడు చంద్రబాబు ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో బీజేపీ, జనసేనతో పొత్తు ఖాయం చేసుకున్నారు.సీట్ల పైన నిర్ణయం తీసుకున్నారు.

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తమతో కలిస్తే ఎన్నికల వేళ కలిసి వస్తుందనే అంచనాలతో ఉన్నారు. ప్రధాని మోదీ సభకు భారీ ప్రచారం చేసారు. సభా నిర్వహణలో లోపాలు స్పష్టంగా కనిపించాయి. చంద్రబాబు, పవన్ తమ ప్రసంగాల్లో ప్రధానంగా మోదీని ప్రశంసించటానికే ప్రాధాన్యత ఇచ్చారు.
ఏపీలో ఎవరి వైపు
ఇక, మోదీ ప్రసంగం మాత్రం పూర్తిగా వ్యూహాత్మకంగా సాగింది. తన ప్రసంగంలో ఎక్కడా చంద్రబాబును ప్రశంసించలేదు. తెలుగుదేశం, జనసేన పేర్లను ప్రస్తావించలేదు. జగన్ ను దూషించలేదు. జగన్ మంత్రులు అవినీతిలో పోటీ పడుతున్నారని అన్నారు. కానీ, జగన్ అవినీతి చేస్తున్నారని చెప్పలేదు. చంద్రబాబు - పవన్ గురించి ఒకే సందర్భంలో ప్రస్తావన చేసారు.
జగన్ పాలన గురించి ప్రధాని సభలో పవన్ కల్యాణ్ విమర్శలు చేసారు. చంద్రబాబు ప్రధానికి అర్దం అయ్యేందుకు ఇంగ్లీషు, హిందీలోనూ వివరించే ప్రయత్నం చేసారు. ప్రధాని తన ప్రసంగంలో జగన్ ను ఇరకాటంలోకి నెట్టే విధంగా విమర్శలు చేస్తారని.. తమకు రాజకీయంగా ఆ వ్యాఖ్యలు కలిసి వస్తాయని చంద్రబాబు, పవన్ భావించారు. కానీ, అందుకు భిన్నంగా ప్రధాని ప్రసంగం కొనసాగింది.
బీజేపీ మార్క్ రాజకీయం
ఇక, చంద్రబాబు ,పవన్ పదే పదే సొంత చెల్లులు సైతం జగన్ కు వ్యతిరేకంగా ఉన్నారని ప్రచారం చేస్తున్నారు. కానీ, ప్రధాని మోదీ మాత్రం తన ప్రసంగంలో వైసీపీ - కాంగ్రెస్ ఒక్కటేనని వ్యాఖ్యానించారు. ఒకే కుటుంబ సభ్యులు రెండు పార్టీల్లోనూ ఉన్నారని చెప్పుకొచ్చారు. వైసీపీ వ్యతిరేక ఓటు కోసం కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని విశ్లేషించారు. ఆ రెండు పార్టీలకు ఓటు వేయవద్దని ప్రజలను కోరారు. ఈ వ్యాఖ్యలు ఎవరికీ అంతు చిక్కలేదు.
కేంద్రం ఏపీ కోసం ఏం చేసిందో వివరించారు. చంద్రబాబు పాలన గురించి మాట మాత్రం చెప్పలేదు. జగన్ పైన నామ మాత్రంగా స్పందించారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. దీని ద్వారా. ..గతంలో చోటు చేసుకున్న పరిణామాలు.. ఏపీలో ఎన్నికల ఫలితాలు...భవిష్యత్ అవసరాలను పరిగణలోకి తీసుకొనే మోదీ తన మార్క్ రాజకీయం ఏపీలో చూపిస్తున్నారనే విశ్లేషణ వినిపిస్తోంది.












Click it and Unblock the Notifications