ఏపీలో ఈ నాలుగు లోక్‌సభ స్థానాలపై బీజేపీ గురి
PM Modi AP visit: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌కు కౌంట్ డౌన్ ఆరంభమైంది.. గడువు సమీపించింది. ఎన్నికలకు ఎంతో సమయం లేదు. ఇంకో ఎనిమిది రోజులు మాత్రమే వ్యవధి ఉంది. ఈ నెల 13వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ నియోజకవర్గాలకు ఒకే రోజున పోలింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. జూన్ 4వ తేదీన ఓట్లను లెక్కిస్తారు.
పోలింగ్ గడువు దగ్గర పడుతోండటం అన్ని పార్టీలు కూడా జనంలోకి చొచ్చుకెళ్తోన్నాయి. ఇంటింటి ప్రచారాన్ని చేపట్టాయి. 2019 నాటి ఎన్నికల్లో సాధించిన పట్టును నిలుపుకోవడానికి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహాలను రూపొందించుకుంది. అప్పటి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ 151 అసెంబ్లీ, 22 లోక్‌సభ స్థానాలను గెలుచుకున్న విషయం తెలిసిందే.

ఈ సంఖ్యను మరింత పెంచుకునే ప్రయత్నాల్లో ఉందా పార్టీ అగ్రనాయకత్వం. వైనాట్ 175/25 అనే నినాదంతో ప్రచార కార్యక్రమాలను చేపట్టింది. అటు తెలుగుదేశం- జనసేన- భారతీయ జనత పార్టీ కూటమి దీనికి ధీటుగా ఎన్నికల్లో ప్రచారం సాగిస్తోంది. వైఎస్ఆర్సీపీ దూకుడుకు అడ్డుకట్ట వేయాలనే పట్టుదలతో ఉంది.
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్.. విస్తృతంగా ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటోన్నారు. పవన్ కల్యాణ్ కోసం టీవీ నటులు, కొందరు హీరోలు సైతం రోడ్డెక్కారు. కూటమి అభ్యర్థులు పోటీలో ఉన్న కొన్ని నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తోన్నారు.
తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఆయన షెడ్యూల్ ఖరారైంది. 6, 8 తేదీల్లో మోదీ ఏపీలో నాలుగు లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో రోడ్ షోలు, బహిరంగ సభల్లో పాల్గొనబోతోన్నారు. ఈ నాలుగు స్థానాల్లో ఒక్కటి మినహా మిగిలిన మూడు చోట్లా బీజేపీ అభ్యర్థులే పోటీలో ఉండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.
6వ తేదీన రాజమండ్రి, అనకాపల్లిల్లో మోదీ బహిరంగ సభలను నిర్వహించనున్నారు. 8వ తేదీన రాజంపేట, విజయవాడల్లో రోడ్ షోల్లో పాల్గొంటారు. రాజమండ్రి లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా దగ్గుబాటి పురంధేశ్వరి పోటీ చేస్తోన్నారు. అనకాపల్లి- సీఎం రమేష్, రాజంపేట- మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ నుంచి బరిలో నిలిచారు. విజయవాడలో కూటమి క్యాండిడేట్‌గా కేశినేని చిన్ని పోటీ చేస్తోన్నారు.












Click it and Unblock the Notifications