నేడే.. పుట్టపర్తికి ప్రధాని మోదీ: అక్కడ PM KISAN- అన్నదాత నిధులు విడుదల
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు ఏపీ, తమిళనాడుల్లో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. పీఎం-కిసాన్ పథకం కింద దేశవ్యాప్తంగా తొమ్మిది కోట్ల మంది రైతులకు లబ్ది కలిగించడానికి 18,000 కోట్ల రూపాయల నిధులను విడుదల చేయనున్నారు. ఇది 21వ విడత నిధుల విడుదల. నెల రోజుల వ్యవధిలో ఆయన ఏపీకి రాబోతోండటం ఇది రెండోసారి. కిందటి నెల 16వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తో కలిసి శ్రీశైలం మల్లికార్జున స్వామివారిని దర్శించుకున్నారు.
తొలుత మోదీ ఏపీకి వస్తారు. పుట్టపర్తికి చేరుకుంటారు. అక్కడ ఆయన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా ఆశ్రమాన్ని సందర్శిస్తారు. మహాసమాధిని వద్ద నివాళి అర్పిస్తారు. అనంతరం సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా శ్రీ సత్యసాయి బాబా జీవితం, బోధనలు, శాశ్వత వారసత్వాన్ని గౌరవిస్తూ స్మారక నాణేన్ని విడుదల చేస్తారు. శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ప్రత్యేకంగా ముద్రించిన పోస్టల్ స్టాంపులను ఆవిష్కరిస్తారు. అక్కడే ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

ఆ తర్వాత ప్రధాని మోదీ తమిళనాడుకు బయలుదేరి వెళ్తారు. మధ్యాహ్నానికి కోయంబత్తూరుకు చేరుకుంటారు. 1:30 గంటలకు 'సౌత్ ఇండియా నేచురల్ ఫార్మింగ్ సమ్మిట్'ను ప్రారంభిస్తారు. ఈ సదస్సు సందర్భంగా.. రైతుల సంక్షేమానికి తన ప్రభుత్వం చేపట్టిన పథకాల గురించి వివరిస్తారు. వ్యవసాయాన్ని పునరుజ్జీవింపజేయడానికి తీసుకుంటోన్న నిర్ణయాలపై ప్రసంగిస్తారు. అనంతరం పీఎం-కిసాన్ 21వ విడత నిధులను విడుదల చేస్తారు.
ఈ సమ్మిట్‌లో కూడా ప్రధాని మోదీ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. నేటి నుండి 21వ తేదీ వరకు జరిగే ఈ సౌత్ ఇండియా నేచురల్ ఫార్మింగ్ సమ్మిట్‌ను తమిళనాడు నేచురల్ ఫార్మింగ్ స్టేక్‌హోల్డర్స్ ఫోరమ్ నిర్వహిస్తోంది. సహజసిద్ధ, పర్యావరణ అనుకూల, రసాయన రహిత వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడమే ఈ సదస్సు ప్రధాన ఉద్దేశం. దేశ వ్యవసాయానికి ఉజ్వల భవిష్యత్తు కల్పించడం, నేచురల్ ఫార్మింగ్ ను రైతులకు లాభదాయకంగా, పర్యావరణానికి అనుకూలంగా మార్చడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఇందులో చర్చిస్తారు.
ఈ సదస్సులో రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, గ్రామీణ పారిశ్రామికవేత్తల కోసం మార్కెట్ అనుసంధానాలపై దృష్టి సారిస్తారు. అలాగే- సేంద్రీయ ఇన్‌పుట్‌లు, వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్, పర్యావరణ అనుకూల ప్యాకేజింగ్, స్వదేశీ సాంకేతికతలలో నూతన ఆవిష్కరణలను ప్రదర్శిస్తారు. తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, తెలంగాణ, కర్ణాటక, ఏపీ నుంచి 50,000 మందికి పైగా రైతులు, సహజ వ్యవసాయదారులు, శాస్త్రవేత్తలు, సేంద్రీయ ఇన్‌పుట్‌ల సరఫరాదారులు, విక్రేతలు, ఇతర భాగస్వాములు పాల్గొంటారని అంచనా.












Click it and Unblock the Notifications