చంద్రబాబుతో మోదీ ఉభయకుశలోపరి: చెప్పినవన్నీ విన్నారు?
అమరావతి/న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక జీ20 శిఖరాగ్ర సదస్సుకు భారత్ ఆతిథ్యాన్ని ఇవ్వబోతోంది. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు 20 దేశాల అధ్యక్షులు, ప్రధానమంత్రులు హాజరు కానున్నారు. అమెరికా, ఫ్రాన్స్, రష్యా, చైనా అధ్యక్షులు జో బైడెన్, ఎమ్మానుయెల్ మక్రాన్, వ్లాదిమిర్ పుతిన్, గ్ఝి జిన్‌పింగ్.. సహా వివిధ దేశాల ప్రధానులు ఈ సమ్మిట్‌లో పాల్గొనడానికి భారత్‌కు రానున్నారు. వచ్చే ఏడాది ఈ సదస్సు ఏర్పాటు కానుంది.

జీ20 సమ్మిట్ కళ..
వచ్చే ఏడాది సెప్టెంబర్ 9, 10 తేదీల్లో దేశ రాజధాని వేదికగా ఈ జీ20 సమ్మిట్ జరుగనుంది. భారత్ సహా అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, టర్కీ, బ్రిటన్, అమెరికాతో పాటు యూరోపియన్ యూనియన్ దేశాలు ఇందులో సభ్యలుగా కొనసాగుతున్నాయి. ఇటీవలే జీ20 సదస్సు ఇండొనేసియాలోని బాలిలో ముగిసిన విషయం తెలిసిందే.

షెర్పా సదస్సు కూడా..
దీనికి సన్నాహకంగా జీ20 షెర్పా సదస్సును ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. దీనికి సమాంతరంగా అఖిల పక్ష సమావేశాన్నీ పిలిచింది. ఈ సాయంత్రం దేశ రాజధానిలో ఈ అఖిలపక్ష భేటీ ఏర్పాటైంది. కేంద్ర ప్రభుత్వం తరఫున ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులు అమిత్ షా, సుబ్రహ్మణ్యం జైశంకర్, ప్రహ్లాద్ జోషి, నిర్మల సీతారామన్, పియూష్ గోయెల్, రాజ్‌నాథ్ సింగ్ హాజరయ్యారు.

రాష్ట్రం నుంచి..
రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఈ భేటీలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రు మమతా బెనర్జీ, నవీన్ పట్నాయక్, ఎంకే స్టాలిన్, ప్రేమ్ సింగ్ తమాంగ్, ఏక్‌నాథ్ షిండే, అరవింద్ కేజ్రీవాల్ హాజరయ్యారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, జనతాదళ్ (సెక్యులర్) అధినేత, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ, సీపీఎం, సీపీఐ ప్రధాన కార్యదర్శులు సీతారాం ఏచూరి, డీ రాజా ఇందులో పాల్గొన్నారు.

చాలాకాలం తరువాత..
అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసిన హాల్‌లోకి ప్రవేశించిన వెంటనే ప్రధాని నరేంద్ర మోదీ ఆయా నాయకులకు స్వాగతం పలికారు. ఆప్యాయంగా పలకరించారు. విశేషాలను అడిగి తెలుసుకున్నారు. సుదీర్ఘకాలం తరువాత ప్రధాని- అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయడం అటు రాజకీయంగా కూడా ప్రాధాన్యతను సంతరించుకుంది. అందరి చూపులూ దీని మీదే నిలిచాయి. ఎలాంటి అంశాలను ముఖ్యమంత్రులు, ఆయా పార్టీల అధినేతలు కేంద్రం ముందు ఉంచుతారనేది ఆసక్తి రేపుతోంది.

చంద్రబాబుతో ప్రత్యేకంగా..
ఈ క్రమంలో చంద్రబాబును ప్రధాని మోదీ ప్రత్యేకంగా కలుసుకొన్నారు. షేక్ హ్యాండ్ ఇచ్చారు. చిరునవ్వుతో పలకరించారు. క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. కాగా- ప్రత్యేకంగా తనకు అపాయింట్‌మెంట్ ఇవ్వాలని చంద్రబాబు విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ స్థితిగతులు, 2024 సార్వత్రిక ఎన్నికల సమయం నాటికి వేయాల్సిన అడుగుల గురించి మాట్లాడటానికి ఈ అపాయింట్‌మెంట్ కోరినట్లు చెబుతున్నారు. దీనికి మోదీ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.

డిజిటల్ నాలెడ్జ్‌పై
అనంతరం చంద్రబాబు అఖిల పక్ష సమావేశంలో మాట్లాడారు. దేశ భవిష్యత్ కోసం వచ్చే 25 సంవత్సరాలకు అవసరమైన విజన్ డాక్యుమెంట్ సిద్దం చేసుకోవాల్సి ఉంటుందని సూచించారు. ఈ పాతికేళ్లల్లో భారత్ ప్రపంచదేశాల్లోనే అగ్రస్థానానికి చేరకుంటుందని అన్నారు. యువ శక్తి దేశానికి ఉన్న ప్రధాన బలం అని, వారికి అవకాశాలు సృష్టించేలా ప్రభుత్వాలు విధానాలను రూపొందించాల్సిన అవసరం ఉందని చెప్పారు. మానవ వనరులు, నాలెడ్జ్ ఎకానమీని అనుసంధానించడం ద్వారా అత్యుత్తమ ఫలితాలు వస్తాయని అన్నారు.












Click it and Unblock the Notifications