2027 నాటికి పోలవరం ప్రాజెక్ట్ జాతికి అంకితం - ఏపీ సీఎం
పోలవరం ప్రాజెక్టును 2027 నాటికి పూర్తిచేసి జాతికి అంకితం చేస్తామని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. గతంలో ప్రాజెక్టు ఆలస్యమయ్యేలా చేశారని, దీని వల్ల డయాఫ్రం వాల్ ఖర్చు రెండున్నర రెట్లు పెరిగిందని విమర్శించారు. పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుల అనుసంధానంపై కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ మేరకు సచివాలయం నుంచి స్వర్ణాంధ్ర కార్యాలయాలను వర్చువల్‌గా ప్రారంభించారు.
ఈ మేరకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఎంఎస్‌ఎంఈలు (MSME) ఏర్పాటు చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. సేవారంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తామని, ఆ రంగం నుంచి ఆదాయం పెంచేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు. అలానే విధ్వంసం నుంచి అభివృద్ధి దిశగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన స్పష్టం చేశారు. పీ-4 కార్యక్రమాన్ని మరింత పటిష్ఠంగా అమలు చేస్తామన్నారు.

అంతే కాకుండా అమరావతి నగరాన్ని సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టుగా అభివృద్ధి చేస్తామని సీఎం చెప్పారు. విశాఖపట్నంను ముంబయిలా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలను రూపొందించిందని తెలిపారు. ఇప్పటికే అనేక ఐటీ సంస్థలు, పరిశ్రమలు విశాఖ వైపు వస్తున్నాయని చెప్పారు. విశాఖ రైల్వే జోన్ పనులు ప్రారంభమైనట్లు వెల్లడించారు. అలానే తిరుపతిని కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. ప్రాజెక్టులు వేగంగా పూర్తవాలని, కూటమి నేతలు ఎల్లప్పుడూ క్షేత్రస్థాయిలో పనుల పరిశీలన చేయాలన్నారు. అలా చేయగలిగితేనే అసలు ప్రాజెక్టుల పురోగతి స్పష్టంగా తెలుస్తుందని వివరించారు.
ప్రస్తుతం సేవారంగం ద్వారా రాష్ట్రానికి 6.3 శాతం మాత్రమే ఆదాయం వస్తోందని, దీన్ని విస్తరిస్తే రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు మెరుగవుతాయని అభిప్రాయపడ్డారు. ఉద్యోగావకాశాలు, పెట్టుబడులు పెరగాలంటే సేవారంగ అభివృద్ధి కీలకమని చెప్పారు. అభివృద్ధి మరియు సంక్షేమాన్ని సమతుల్యంగా ముందుకు తీసుకెళ్లే విధంగా పాలన కొనసాగిస్తామని తెలిపారు. తలసరి ఆదాయంలో విశాఖ ముందుండగా, శ్రీకాకుళం వెనుకబడిందని గుర్తించారు. ప్రతి ఏడాది తలసరి ఆదాయాన్ని బెంచ్‌మార్క్ చేసుకుని సమీక్షిస్తామని వెల్లడించారు.
టెక్నాలజీ భవిష్యత్తులో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. "టెక్నాలజీ అనేది గేమ్ ఛేంజర్. రానున్న కాలంలో యుద్ధాలు కూడా డ్రోన్లతోనే జరగనున్నాయి," అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. టెక్ ఆధారిత పాలనకు ప్రాధాన్యతనిస్తూ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ను పెంపొందించనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో అన్నప్రసాదం సేవలు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. ఇప్పటికే 21 దేవాలయాల్లో ఈ సేవలు ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు. ఇది మతపరంగా మాత్రమే కాక, సామాజిక సేవగా కూడా చూస్తున్నామని చెప్పారు.
ఇక మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోందని చెప్పారు. జూలై నెలలో "తల్లికి వందనం" పథకాన్ని అమలు చేస్తామన్నారు. అలాగే ఆగస్టు 15 నుంచి రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం అందుబాటులోకి వస్తుందని ప్రకటించారు.












Click it and Unblock the Notifications