పెద్ద కథే: బెజవాడ ఆస్పత్రి నుంచి శిశువుని ఎలా కిడ్నాప్ చేశారంటే!

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: బెజవాడలో సంచలనం సృష్టించిన పసికందు కిడ్నాప్ కేసులో నిందితులను పోలీసులు మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. ఒకరితో పెళ్లి, మరొకరితో సహజీవనం, మూడో వ్యక్తితో పెళ్లి ఇలా నాటకీయ పరిణామాల మధ్య పసికందు కిడ్నాప్ చేసిన ఓ మహిళ నిర్వాకమిది.

పోలీసులు వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. కృష్ణాజిల్లా అవనిగడ్డకు చెందిన కొండవీటి నాగమల్లేశ్వరి (27) తన బావ వీరబాబును పెళ్లి చేసుకుని ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చింది. ఆ తర్వాత భర్తతో మనస్పర్ధలు రావడంతో అతని నుంచి విడిపోయి, హైదరాబాద్‌లోని బంధువల ఇంటికి వెళ్లింది.

అక్కడే ఓ టైలరింగ్ షాపులో పనిచేస్తూ కాలాన్ని వెళ్లదీసింది. కొన్ని నెలల తర్వాత రాకేష్‌ అనే వ్యక్తితో ఆమెకు పరిచయం ఏర్పడి అతడితో నాలుగు ఏళ్లపాటు సహజీవనం చేసింది. ఆ తర్వాత రాకేష్‌కు వేరొక మహిళతో వివాహం జరగడంతో మల్లీశ్వరి తిరిగి అవనిగడ్డకు చేరుకుంది.

కృష్ణాజిల్లా ఉల్లిపాలెంకు చెందిన మద్దా జ్యోతి స్వర్ణరాజు(29)ను 2015లో వివాహం చేసుకుంది. అయితే తనకు ఇంతకు ముందే పెళ్లి అయిన విషయం, వేరొకరితో సహజీవనం చేసిన విషయాన్ని గానీ, తనకు ట్యూబెక్టమీ ఆపరేషన్ అయిందనే విషయాన్ని గానీ స్వర్ణరాజుకు ఆమె చెప్పలేదు.

Police bring in front of media vijayawada kidnap case accused

తనకు పిల్లలు పుట్టరనే విషయం తన భర్త స్వర్ణరాజుకు తెలిస్తే వదిలేస్తాడనే భయంతో గర్భమని నమ్మించి, నాలుగు నెలల తర్వాత కావాలనే జారిపడి గర్భస్రావం అయినట్టు అతడిని నమ్మించింది. ఆ తర్వాత మళ్లీ గర్భం వచ్చిందని నటించి, తొమ్మిది నెలలు గడిచాక చెన్నైలోని తన బంధువుల ఇంటికి వెళ్లి ఆపరేషన చేయించుకుని వస్తానని భర్తకు చెప్పి ఈ నెల 11వ తేదీ రాత్రి చెన్నై బయల్దేరింది.

అక్కడి ఆసుపత్రుల్లో మగశిశువు కోసం ప్రయత్నించి విఫలమైంది. దీంతో చేసేదేమి లేక ఈనెల 13వ తేదీన విజయవాడకు చేరుకుంది. విజయవాడ ప్రభుత్వాసుపత్రికి చేరుకున్న ఆమె అక్కడ రికార్డు అసిస్టెంట్‌ను శ్రీను(51) అనే వ్యక్తిని పరిచయం చేసుకుని.. ఆసుపత్రిలో ఇటీవల జన్మించిన మగశిశువులెవరైనా ఉంటే ఇవ్వాలని అతడిని కోరింది.

దీనికి అంగీకరించిన అతడు 14వ తేదీన సెక్యూరిటీ గార్డ్సు ముఖర్జీ, కన్నయ్యల సహాయంతో ఐతా కల్యాణి జన్మించిన ఐదురోజుల బిడ్డను అపహరించి ఆమెకు అందజేశాడు. బిడ్డను కిడ్నాప్ చేసిన తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు విజయవాడ రైల్వేస్టేషనకు కాకుండా, కృష్ణకెనాల్‌ రైల్వేస్టేషన్ వరకు ఆటోలో వెళ్లింది.

అక్కడ నుంచి తెనాలి, ఆపై రేపల్లే మీదుగా అవనిగడ్డలోని తన ఇంటికి చేరుకుంది. అయితే అప్పటికే విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో పసికందు కిడ్నాప్‌కు గురైందన్న విషయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో పిల్లలు లేని స్వర్ణరాజు, నాగమల్లీశ్వరిలకు ఐదు రోజులు పసికందు ఎలా వచ్చిందని స్థానికులు అనుమానించి పోలీసులకు సమాచారం అందించారు.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు స్వర్ణరాజు, నాగమల్లీశ్వరిలను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగుచూసిందని సీపీ గౌతం సవాంగ్‌ వెల్లడించారు. కేవలం భర్తను నమ్మించేందుకు మగ బిడ్డను మల్లీశ్వరి కిడ్నాప్ చేసిందని పోలీసులు గుర్తించారు.

గురువారం మల్లీశ్వరిని, స్వర్ణరాజును, శ్రీను, ముఖర్జీ, కన్నయ్యలను మీడియా ముందు హాజరుపరిచారు. దీంతో ఆసుపత్రి సిబ్బంది శ్రీను, ముఖర్జీ, కన్నయ్యలను ప్రభుత్వం విధుల నుంచి సస్పెండ్‌ చేసింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Police bring in front of media vijayawada kidnap case accused.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి