ఏం జరుగుతుందో?...భయాందోళనల్లో మన్యం:మావోయిస్టుల వారోత్సవాలు...పోలీసుల జల్లెడ!
విశాఖపట్టణం:రోజులు గడిచేకొద్దీ విశాఖ మన్యంలో భయాందోళనలు అంతకంతకూ పెరుగుతున్నాయి. కారణం మరో మూడు రోజుల్లో మావోయిస్టుల వారోత్సవాలు ప్రారంభం కానుండటమే!...
జూలై 28 నుంచి ఆగస్టు 3 వరకు మావోయిస్టులు అమరవీరుల వారోత్సవాలను నిర్వహించనున్నారు. వీటిని దృష్టిలో ఉంచుకుని ఇప్పట్నుంచే పోలీసులు భధ్రతా చర్యలు చేపట్టారు. దీంతో ఒక వైపు మావోయిస్టుల ముప్పు...మరోవైపు పోలీసుల నుంచి తిప్పలు తల్చుకొని మన్యం ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు...ఏ క్షణంలో ఏం జరుగుతుందో నని భయంతో వణికిపోతున్నారు.

మరో మూడు రోజుల్లో మావోయిస్టుల అమరవీరుల వారోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో...పోలీసులు మన్యం ప్రాంతంలోని 17 స్టేషన్ల పరిధిలోనూ రోజువారి తనిఖీలను మరింత తీవ్రతరం చేశారు. మావోయిస్టుల హిట్ జాభితాలో ఉన్న వారికి, అధికార పార్టీ నేతలను పోలీసులు అప్రమత్తం చేస్తున్నారు. సాధ్యమైనంత వరకు వారోత్సవాలు ముగిసే వరకు మన్యం విడిచి వెళ్లాలని సూచనలు చేస్తున్నారు.
మావోయిస్టుల అమరవీరుల వారోత్సవాలంటే...ప్రతియేటా మావోయిస్టులు నిర్వహిస్తున్న సాయుధపోరాటంలో మరణించిన వారి పేరిట స్థూపాలను నిర్మాణం చేసి వారికి నివాళులు అర్పి స్తారు. మరణించిన వారి పేర్లను ఆ స్థూపాలపై రాస్తారు. అయితే వీటిని నిరోధించేందుకు పోలీసులు కూంబింగ్‌ను ఉధృతం చేశారు.ఇటీవల కాలంలో మావోయిస్టు దళ సభ్యుల లొంగుబాట్లు, అరెస్టులు ఎక్కువయ్యాయి. అయినా మావోయిస్టులు చాపకింద నీరులా వారి కార్యకలాపాలను కొన్ని చోట్ల నిర్వహిస్తూనే ఉన్నారని అడపాదడపా జరుగుతున్న ఎన్ కౌంటర్లను బట్టి అర్థం అవుతోంది.
గూడెం, కొయ్యూరు, చింతపల్లిలో కొంత భాగాన్ని పర్యవేక్షణ చేసే గాలికొండ ఏరియా కమిటీకి ప్రస్తుతవ నవీన్ నేతృత్వం వహిస్తున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు చింతపల్లి, జీ మాడుగులలో తిరిగే కోరుకొండ ఏరియా కమిటీని పెదబయలు కమిటీలో విలీనం చేసినట్లుగా పోలీసులకు సమాచారం ఉంది. దీంతో ఈ ప్రాంతాల్లో మావోయిస్టులు సంచరించే ప్రాంతాలపై పోలీసులు తీవ్ర స్థాయిలో నిఘా ఉంచారు. కూంబింగ్‌ను ఉధృతం చేశారు.
ఆగస్టు మూడు వరకూ జరిగే మావోయిస్టు అమరవీరుల వారోత్సవాలు ముగిసేంతవరకు ఈ కూంబింగ్ కొనసాగుతుంది. స్థానికంగా మావోయిస్టులు కొంత వరకు బలహీన పడినా బయట ప్రాంతాల నుంచి విద్వంసాలు చేయొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అందుకే మావోయిస్టులకు ఏమాత్రం అవకాశం ఇవ్వరాదని పట్టుదలతో చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. అనుమానం వస్తే తమదైన శైలిలో సమగ్రంగా విచారిస్తున్నారు. ఈ పరిస్థితుల కారణంగానే తాము అడకత్తెరలో పోకచెక్క మాదిరిగా నలిగిపోవాల్సి ఉంటుందనేది మన్యం జనాల ఆందోళన.












Click it and Unblock the Notifications