వీడియో ఫుటేజీ పరిశీలన: రత్నాచల్ దగ్ధం కేసులో కీలక ఆధారాలు లభ్యం
విజయవాడ: తూర్పు గోదావరి జిల్లా తుని కాపు గర్జనలో హింసాకాండకు సంబంధించి పోలీసులకు మరిన్ని కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. రైలు తగుల బెట్టేముందు పట్టాల హుక్కులను దుండగులు తొలగించినట్లు పోలీసులు గుర్తించారు.
వాటిని తొలగించడం రైల్వే సిబ్బందికే కష్టం అంటున్న అధికారులు అందుకు పాల్పడింది ప్రొఫెషనల్స్ అయి ఉంటారని అన్నారు. వీడియో పూటేజీ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
photos: ముద్రగడ & తుని దృశ్యాలు
పెద్దాపురంలోని ఓ ప్రైవేట్ గెస్ట్‌హౌస్‌లో జిల్లాలోని పోలీసు అధికారులతో అడిషనల్ డీజీ ఠాకూర్ సమావేశమయ్యారు. తుని ఘటనలో నేరస్తుల గుర్తింపు, అరెస్ట్ వ్యూహాలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

యాభై మందిపై కేసు
తుని కాపు గర్జన హింసాకాండపై పోలీసులు సుమారు 50 కేసులు నమోదుచేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. పలు ప్రభుత్వ,ప్రైవేటు ఆస్థుల ధ్వంసం నుంచి జర్నలిస్టుల నుంచి అందిన ఫిర్యాదుల వరకూ ఎక్కడికక్కడ కేసులు నమోదుచేయడంపై ఉన్నతాధికారులు దృష్టి సారించారు.
సోమవారం అంతా దీనికి సంబంధించి ప్రత్యేక సిబ్బందిని కేటాయించారు. వివిధ వర్గాల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. బహిరంగ సభకు హాజరైన రెచ్చగొట్టే ప్రసంగాలు చేసిన ప్రముఖుల నుంచి దహనకాండలో స్వయంగా పాల్గొన్న వారి వరకూ సుమారు 250మంది నిందితులను గుర్తించినట్లు తెలుస్తోంది.

సభా సమయంలో తీసిన వీడియో క్లిప్పింగులు, క్రేన్ కెమెరాలు తీసిన వీడియో పుటేజీలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు ముందు జాగ్రత్త చర్యగా పోలీసుశాఖ కూడా స్వయంగా నలుగురు ప్రైవేట్ వీడియోగ్రాఫర్లతో సభా దృశ్యాలను చిత్రీకరించింది. ఇపుడు దాన్నిఆయుధంగా ప్రయోగించేందుకు సిద్ధమతున్నట్లు తెలుస్తోంది.
రాష్ట్రం నలుమూలల నుంచి హాజరైన వ్యక్తుల వివరాల సమాచారాన్ని ఆయా ప్రాంతాల నుంచి తెప్పించుకుంటున్నట్లు కూడా తెలుస్తోంది. తమ వైపు నుంచి రెచ్చగొట్టే చర్యలు లేకున్నా తమను లక్ష్యంగాచేసుకుని దాడులకు పాల్పడడాన్ని పోలీసు ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు.












Click it and Unblock the Notifications