వైసీపీ Vs జనసేన: భగ్గుమంటున్న ఏపీ
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ వాతావరణం యుద్ధాన్ని తలపిస్తోంది. ప్రస్తుతం ఈ యుద్ధం వైసీపీ, జనసేన మధ్య నడుస్తోంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాజాగా ఇప్పటంలో మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో వైసీపీ ఎలా గెలుస్తుందో చూస్తానంటూ సవాల్ విసిరారు. దీనిపై మంత్రులు బొత్స సత్యనారాయణ, జోగి రమేష్, అంబటి రాంబాబు, మాజీ మంత్రి పేర్ని నానితోపాటు ఇతర నేతలంతా పవన్ పై విరుచుకుపడ్డారు.

జనసేనను లైట్ తీసుకున్నప్పటికీ..
వైసీపీని ఓడించడానికి అవసరమైతే పొత్తులకు సిద్ధమంటూ పవన్ ప్రకటన చేసినప్పటి నుంచి ఈ రెండు పార్టీల మధ్య పోరు మొదలైంది. అప్పటివరకు జనసేనను వైసీపీ లైట్ తీసుకుంది. పవన్ కల్యాణ్ పదే పదే తన ప్రసంగాల్లో, కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి జగన్ పై, పార్టీ నాయకులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. గత ఎన్నికల్లో దాదాపు 35 నుంచి 40 నియోజకవర్గాల్లో జనసేన చీల్చిన ఓట్లు వైసీపీ గెలుపునకు తోడ్పడ్డాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని జనసేనను కట్టడి చేయడానికి వైసీపీ ప్రయత్నిస్తోంది. బీజేపీ ద్వారా నియంత్రించాలనుకున్నప్పటికీ మరోసారి ఓడిస్తానంటూ పవన్ వ్యాఖ్యలు చేయడం యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోంది.

రెండు పార్టీలు పొత్తుతో వెళ్లే అవకాశం కనపడుతోంది!
తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకొని ఎన్నికలకు జనసేన వెళుతుందని అంచనా వేస్తున్న వైసీపీ నేతలు ఆ రెండు పార్టీల మధ్య పొత్తు కుదరకుండా వ్యూహాలు అమలు చేస్తున్నారు. పవన్ విశాఖ పర్యటన, విజయనగరం జిల్లా గుంకలాం పర్యటన, తాజాగా ఇప్పటం పర్యటనల్లో వైసీపీ-జనసేన ఢీ అంటే ఢీ అన్నాయి. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం కూడా నెమ్మదించింది. పోరు మొత్తం ఈ రెండు పార్టీల మధ్యే కేంద్రీకృతమైంది. పలువురు మంత్రులు కూడా జనసేనానిపై మాటల దాడి చేయడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.

రానున్న రోజుల్లో హోరాహోరీ పోరు
మోడీతో పవన్ సమావేశమైన తర్వాత తనకు కూడా ఒక్క ఛాన్స్ ఇవ్వాలంటూ పవన్ ప్రజలను కోరడంతో టీడీపీ-జనసేన మధ్య పొత్తు కుదిరే అవకాశం లేదని వైసీపీ నేతలు అంచనా వేశారు. అయితే మళ్లీ వైసీనీ కూలదోసేవరకు నిద్ర పోనని, బీజేపీ వద్దకు వెళ్లనని, వారి మద్దతు అడగనని, ఇక్కడే తేల్చుకుంటా, ఇక్కడే యుద్ధం చేస్తానన్నారు. దీంతో మళ్లీ ఒక్కసారిగా వైసీపీ-జనసేన మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. రానున్న రోజుల్లో ఈ రెండు పార్టీల మధ్య హోరాహోరీ పోరు సాగే అవకాశం ఉందని సీనియర్ రాజకీయవేత్తలు అంచనా వేస్తున్నారు.












Click it and Unblock the Notifications