పల్నాడులో అర్థరాత్రి ఉద్రిక్తత.. టీడీపీ, వైసీపీ వర్గాల హోరాహోరీ పోరు
రాజకీయ కక్షలు, కార్పణ్యాలకు ఆలవాలమైన పల్నాడులో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మధ్య హోరాహోరీ పోరును పోలీసులు చెదరగొట్టారు. పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లలో శాసనసభ మాజీ స్పీకర్, తెలుగుదేశం పార్టీ నేత డాక్టర్ కోడెల శివప్రసాద్ విగ్రహం ఏర్పాటును వైసీపీ నేతలు అడ్డుకున్నారు.
టీడీపీ జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు స్వగ్రామం ఇనుమెళ్లలో ఆ పార్టీకి చెందిన ఇద్దరు నేతల విగ్రహాలను ఆవిష్కరించాలని నిర్ణయించుకున్నారు. జీవీ ఆంజనేయులు తండ్రి గోనుగుంట్ల సత్యనారాయణ విగ్రహం గ్రామ కూడలిలో అప్పటికే ఏర్పాటు చేశారు. ఎన్టీ ఆర్ విగ్రహం సమీపంలో మరో దిమ్మె నిర్మించి కోడెల విగ్రహాన్ని దానిపైకి తెచ్చారు.

అదే సమయంలో అక్కడికి వచ్చిన వైసీపీ నాయకులు ప్రభుత్వ అనుమతి లేకుండా ఆలయం వద్ద కోడెల విగ్రహాన్ని ఎలా ఏర్పాటు చేస్తారంటూ అభ్యంతరం తెలిపారు. ఇదే కూడలిలో వైసీపీ నేతల విగ్రహాలు కూడా ఉన్నాయికదా అని తెలుగుదేశం పార్టీవారు ప్రశ్నించారు. దీంతో మాటామాటా పెరిగి ఇరువర్గాల మధ్య ఉద్రిక్తత తలెత్తింది.
వెంటనే సమాచారం అందుకున్న తహశీల్దారు విజయజ్యోతికుమారి, వినుకొండ, ఈపూరు పోలీసులు అక్కడికి వచ్చారు. గుంపుగా చేరిన ప్రజలను పోలీసులు చెదరగొట్టారు. ప్రభుత్వ అనుమతి లేకపోవడంతో కోడెల విగ్రహాన్ని దిమ్మె పై నుంచి తొలగించి ట్రాక్టరులో తహశీల్దారు కార్యాలయానికి తరలించారు. గ్రామంలో ఉద్రిక్తతలు తలెత్తకుండా ఉండేందుకు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications