ఏపీలో ఆ పార్టీదే అధికారం: తేల్చేసిన తాజా సర్వే రిపోర్ట్: జగన్‌పై దాడి జరిగిన వేళ..
AP Assembly elections 2024: రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ప్రచార వేడి ఉధృతమైంది. అన్ని పార్టీలు కదనరంగంలోకి దూకాయి. ఎన్నికల సంగ్రామంలో చావో రేవో తేల్చుకోనున్నాయి. దీనికి అవసరమైన అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకున్నాయి. ప్రచార కార్యక్రమాల్లో తల మునకలయ్యాయి.
పోలింగ్ గడువు దగ్గరపడుతున్న కొద్దీ రాష్ట్రంలో సర్వేలు జోరందుకున్నాయి. రాష్ట్ర, జాతీయ స్థాయిలో అన్ని సర్వే సంస్థలు కూడా ఏపీ ఎన్నికలపై తమ సర్వేలను నిర్వహిస్తోన్నాయి. ఎప్పటికప్పడు వాటిని విడుదల చేస్తూ వస్తోన్నాయి. అభ్యర్థుల జాబితా మొదలుకుని ప్రచార కార్యక్రమాలు, వాటికి లభిస్తోన్న జనాదరణ, ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేయగల అన్ని పరిణామాలను కూడా తమ సర్వే కోసం పరిగణనలోకి తీసుకుంటోన్నాయి.

అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఏ పార్టీ అత్యధిక స్థానాలను గెలుచుకుంటుందనే విషయాలపై దాదాపుగా అన్ని సర్వే సంస్థలు కూడా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపిన విషయం తెలిసిందే. జాతీయ స్థాయి సర్వేలు సైతం ఈ విషయాన్నే ధృవీకరించాయి. జన్‌మత్, పొలిటికల్ క్రిటిక్, లోక్‌పోల్, ఆత్మసాక్షి సంస్థలు కూడా తమ సర్వేల్లో జనం జగన్‌కే జై కొట్టిన విషయాన్ని వెల్లడించాయి.
ఈ పరిస్థితుల మధ్య- తాజాగా పోల్ స్ట్రాటజీ గ్రూప్.. ఏపీ రాజకీయాలపై తన సర్వేను నిర్వహించింది. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేదెవరనేది తేల్చి చెప్పింది. ఈ ఏడాది మార్చి 16 నుంచి ఏప్రిల్ 10వ తేదీ మధ్యన ఈ సర్వే నిర్వహించిందా సంస్థ. 1,48,532 మంది ఓటర్ల అభిప్రాయాలను సేకరించింది.
ఈ సర్వే రిపోర్ట్ ప్రకారం చూస్తే- ఏపీలో మరోసారి వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావడం ఖాయం. ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ 120 నుంచి 130 అసెంబ్లీ స్థానాల్లో జయకేతనాన్ని ఎగురవేస్తుంది. విజయఢంకా మోగిస్తుంది. లోక్‌సభలోనూ వైఎస్ఆర్సీపీ ప్రభంజనం కనిపిస్తుంది. 19 నుంచి 21 లోక్‌సభ నియోజకవర్గాల్లో వైసీపీ జెండా ఎగురుతుంది.

తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ కూటమికి మరోసారి పరాభవం తప్పకపోవచ్చని పోల్ స్ట్రాటజీ గ్రూప్ ప్రీ- పోల్ సర్వే అంచనా వేసింది. మూడు ప్రధాన పార్టీలు కలిసి కూటమి కట్టినప్పటికీ ఓటమి తప్పదని అభిప్రాయపడింది. 45 నుంచి 55 అసెంబ్లీ స్థానాలు మాత్రమే దీనికి దక్కుతాయని తేల్చి చెప్పింది. లోక్‌సభలో కూడా కూటమికి 4 నుంచి 6 స్థానాలు లభిస్తాయని పేర్కొంది.
వైఎస్ఆర్సీపీకి పోల్ అయ్యే ఓట్ల శాతం 50 నుంచి 52 వరకు ఉంటుంది. 48 శాతం మంది పురుషులు, 55 శాతం మంది మహిళలు వైఎస్ఆర్సీపీ వైపే ఉన్నారు. టీడీపీ కూటమికి పడే ఓట్ల శాతం 44 నుంచి 46 వరకు ఉంటుంది. ఇందులో పురుషులు 47, మహిళలు 40 శాతం మంది కూటమికి ఓటు వేస్తారు. ఇతరులకు పడే ఓట్ల శాతం 0.5 శాతం మాత్రమే.












Click it and Unblock the Notifications