ఢిల్లీలో బాబు, రాష్ట్రాల్లో జగన్ పరువు తీశారు: పొన్నం
న్యూఢిల్లీ/నిజామాబాద్: రాష్ట్ర ప్రతిష్టను, ఆత్మగౌరవాన్ని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ రోడ్ల పైకి ఈడిస్తే, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్ని రాష్ట్రాల రోడ్ల పైకి ఈడుస్తున్నారని కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు, కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ ధ్వజమెత్తారు. ఢిల్లీలో తెలంగాణ ప్రాంత నేతలు విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడారు.
ప్రజల ఆకాంక్ష మేరకే తాము తెలంగాణ కోసం ఉద్యమం చేశామన్నారు. రాష్ట్ర విభజన చట్టపరిధిలో ఉన్న అంశమని, ఆ ప్రకారమే కేంద్రం వెళ్తోందన్నారు. తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణపై ఒకే నిర్ణయానికి కట్టుబడి ఉన్నాయన్నారు. రాయల తెలంగాణను తాము అంగీకరించే ప్రసక్తి లేదని, హైదరాబాదు రాజధానిగా పది జిల్లాల తెలంగాణనే కావాలన్నారు. తెలంగాణపై తమ ప్రాంతంలోని అన్ని రాజకీయ పార్టీలు ఒకే నిర్ణయంతో ఉన్నాయని చెప్పారు.

రాయల టి అపోహ: సర్వే
రాయల తెలంగాణ కేవలం అపోహ మాత్రమేనని కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ చెప్పారు. హైదరాబాదు రాజధానిగా పది జిల్లా తెలంగాణ ఏర్పాటు ఖాయమన్నారు. జనవరి నెలకల్లా రెండు రాష్ట్రాలు ఏర్పడి కొత్త ముఖ్యమంత్రిలను ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ నియమిస్తారని చెప్పారు.
సామాజిక తెలంగాణ: బస్వరాజు
పది జిల్లాల సామాజిక తెలంగాణనే తాము కోరుకుంటున్నామని మంత్రి బస్వరాజు సారయ్య చెప్పారు. రాయల తెలంగాణ ఒప్పుకునేది లేదన్నారు.
దుర్మార్గ చర్య: హరీష్ రావు
రాయల తెలంగాణ దుర్మార్గపు చర్య అని తెలంగాణ రాష్ట్ర సమితి సిద్దిపేట శాసన సభ్యుడు హరీష్ రావు నిజామాబాద్ జిల్లాలో అన్నారు. పది జిల్లాల తెలంగాణ ఇవ్వకుంటే మరోసారి తాము ఉద్యమిస్తామన్నారు.












Click it and Unblock the Notifications