తిరుమలకు వెళ్తున్నారా?
Tirumala: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల తాకిడి కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం పోటెత్తుతున్నారు. వేలాదిమంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటోన్నారు. తమ మొక్కులను చెల్లించుకుంటోన్నారు. కొద్దిరోజులుగా శ్రీవారిని దర్శించుకుంటోన్న భక్తుల సంఖ్య 80 నుంచి 90 వేల మధ్య ఉంటోండటమే దీనికి నిదర్శనం.
బుధవారం నాడు 80,048 మంది శ్రీనివాసుడిని దర్శించుకున్నారు. వారిలో 35,403 మంది తల నీలాలను సమర్పించారు. హుండీ ద్వారా 4.17 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. సర్వదర్శనం టోకెన్లు ఉన్న వారికి స్వామివారి దర్శనానికి 20 గంటలకు పైగా సమయం పట్టింది.

కంపార్ట్‌మెంట్లన్నీ నిండిపోవడంతో పాటు ఏటీసీ సర్కిల్ వరకు క్యూ లైన్ ఏర్పడింది. క్యూ లైన్‌లో ఉన్న వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ అధికారులు చర్యలు తీసుకున్నారు. అల్పాహారం, పాలు, మంచినీటి వసతిని కల్పించారు. ఈ రద్దీ మరిన్ని రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని టీటీడీ అధికారులు అంచనా వేస్తోన్నారు.
అదే సమయంలో- తిరుమలలో పౌర్ణమి గరుడ సేవ ఉత్సవం అంగరంగ వైభవంగా ముగిసింది. వైశాఖ పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీమలయప్ప స్వామివారు గరుడవాహనాన్ని అధిరోహించారు. నాలుగు మాడ వీధుల్లో ఊరేగారు. భక్తులను కటాక్షించారు. శ్రీవారి ఆలయంలో గురువారం రాత్రి 7 గంటలకు గరుడ వాహన సేవ ప్రారంభమైంది. సుమారు రెండు గంటల పాటు కొనసాగింది.
వైఖానస ఆగమం ప్రకారం.. వైశాఖ పౌర్ణమి వేడుకలను టీటీడీ అర్చకులు కన్నుల పండువగా నిర్వహించారు. గరుడ వాహనంపై ఊరేగుతున్న సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారిని వేలాదిమంది భక్తులు మలయప్ప స్వామివారిని దర్శించుకున్నారు. హారతులు పట్టారు. నాలుగు మాడ వీధులు భక్తులతో నిండిపోయాయి. గ్యాలరీలు క్రిక్కిరిసిపోయాయి.












Click it and Unblock the Notifications