దేశవ్యాప్తంగా కాంగ్రెస్ స్థానాన్ని భర్తీ చేయబోతున్నాం: అమిత్ షాతో భేటీ తర్వాత కేఏ పాల్
దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పనైపోయిందని, ప్రతిపక్ష స్థానాన్ని తామే భర్తీచేయబోతున్నట్లు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వ్యాఖ్యానించారు. రాబోయే ఎన్నికల్లో ఒక్క హైదరాబాద్ లోక్ సభ స్థానం మినహా ఏపీ, తెలంగాణలోని అన్ని లోక్ సభ స్థానాల్లో ప్రజాశాంతి పార్టీ గెలవబోతోందని చెప్పారు.
తెలంగాణ అప్పులు రూ.4.50 లక్షల కోట్లుగా ఉందని, 8 సంవత్సరాలుగా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న కేసీఆర్, కేటీఆర్ రూ.7 లక్షల కోట్లు ఏమయ్యాయో చెప్పడంలేదని ఆరోపించారు. రూ.3.50 లక్షల కోట్ల అప్పు చేసిన శ్రీలంక దివాళా తీసిందని, దీనికి కుటుంబ పాలనే కారణమని విశ్లేషించారు. దేశంతోపాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై అమిత్ షాతో చర్చించానని, అలాగే ఏపీ, తెలంగాణ అప్పులపై కూడా చర్చించినట్లు వెల్లడించారు.

తనపై జరిగిన దాడిని అమిత్ షా ఖండించారన్నారు. ఏపీకి నిధులివ్వమని కోరినట్లు తెలిపారు. ఓటుబ్యాంకు లేని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వెంట ఎందుకు పడుతున్నారని అమిత్ షాను అడిగానని, మేం ఆయన వెంట పడటంలేదని, ఆయనే తమవెంట పడుతున్నారని చెప్పారన్నారు. భవిష్యత్తులో జరిగే పరిణామాలను ప్రజలే నిర్ణయించాల్సి ఉందన్నారు.