టీడీపీతో నాకు సంబంధం లేదు..బాంబు పేల్చిన ప్రశాంత్ కిషోర్
Prashant Kishor: సార్వత్రిక ఎన్నికలు సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీలో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఆ దిశగా ముమ్మర కసరత్తు సాగిస్తోన్నాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే నాలుగు విడతల్లో లోక్‌సభ/అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. అయిదో జాబితాపై కసరత్తు చేస్తోంది.
తెలుగుదేశం పార్టీ- జనసేన తమ అభ్యర్థుల జాబితాలను ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తరువాతే అభ్యర్థులను ప్రకటించాలని నిర్ణయించింది. రా..కదలిరా పేరుతో జనంలోకి వెళ్తోంది టీడీపీ. బహిరంగ సభలు, రోడ్ షోలతో పూర్తిస్థాయి ప్రచారానికి దిగింది.

ఈ ఎన్నికల్లో విజయం సాధించడానికి చంద్రబాబు చేయని ప్రయత్నం అంటూ ఏదీ లేదు. ఒంటరిగా ఎన్నికలను ఎదుర్కొనడానికి ఇష్టపడట్లేదు. 2019 ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయమే దీనికి కారణం. పవన్ కల్యాణ్ ఛరిష్మా, కాపు ఓటుబ్యాంకును తనవైపు మళ్లించుకోవడానికి జనసేనతో పొత్తు పెట్టుకున్నారు. బీజేపీతోనూ రాయబారం నడుపుతున్నారు. అది సఫలం కావట్లేదు.
మరోవంక- ప్రశాంత్ కిషోర్‌ను రాజకీయ వ్యూహకర్తగా నియమించుకోవడానికి చంద్రబాబు తనవంతు ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో కిందటి నెల ఆయనను విజయవాడకు పిలిపించుకున్నారు. సుదీర్ఘంగా చర్చించారు. అయినప్పటికీ- ఆ భేటీ అర్ధాంతరంగానే ముగిసింది. ఎలాంటి రిజల్ట్ రాలేదు.
తెలుగుదేశం పార్టీతో కలిసి పని చేయడానికి ప్రశాంత్ కిశోర్ అంగీకరించలేదని చెబుతున్నారు. మరో మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనాల్సిన దశలో ఇప్పుడు తానేమీ చేయలేనని కుండబద్దలు కొట్టారని సమాచారం. జరగాల్సిన డ్యామేజీ జరిగిపోయిందని, దీన్ని సరిదిద్దుకోవడానికి చాలినంత సమయం ఇప్పుడు లేదని ఆయన చంద్రబాబుకు తేల్చి చెప్పారు.
ఇప్పుడు తాజాగా మరోసారి ప్రశాంత్ కిశోర్.. ఈ భేటీపై వివరణ ఇచ్చారు. బిహార్‌లో చేపట్టిన జన్ సురాజ్ పాదయాత్ర సందర్భంగా ఓ హిందీ న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారాయన. రాజకీయంగా సలహాలను ఇవ్వడానికి చంద్రబాబును కలవడానికి తాను విజయవాడకు వెళ్లానని అంగీకరించారు.

చంద్రబాబుకు, తనకు ఉన్న ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా చంద్రబాబును కలవాల్సి వచ్చిందని ప్రశాంత్ కిశోర్ అన్నారు. ఆ కామన్ ఫ్రెండ్ ఓ బిగ్ పొలిటికల్ షాట్ అని వ్యాఖ్యానించారు. చంద్రబాబును ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకసారి కలుసుకోవాలంటూ ఆ కామన్ ఫ్రెండ్ తనపై ఒత్తిడి తెచ్చాడని, అందుకే విజయవాడకు వెళ్లాననీ అన్నారు.
2019 ఎన్నికల్లో ఏపీ ఎన్నికల్లో తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పని చేశానని, ఆ పార్టీ విజయం సాధించిందని, అందుకే ఆ సారి టీడీపి కోసం పని చేయాలంటూ ఆ కామన్ ఫ్రెండ్ ద్వారా ఒత్తిడి తెచ్చారని వివరించారు. ఆయన కోరిక మేరకు విజయవాడకు వెళ్లానని, రాజకీయ వ్యూహకర్తగా ఇప్పుడు పని చేయట్లేదనే చంద్రబాబుకు తేల్చి చెప్పాననీ అన్నారు.
ఏపీ ఎన్నికల్లో ఏ రకంగా కూడా తాను జోక్యం చేసుకోవట్లేదని, తన పాత్ర ఏమీ లేదనీ ప్రశాంత్ కిషోర్ స్పష్టం చేశారు. ప్రస్తుతం తాను బిహార్ రాజకీయాల మీదే పూర్తి దృష్టి పెట్టానని, ఏపీలో ఏ పార్టీ తరఫునా తాను పని చేయట్లేదని అన్నారు.












Click it and Unblock the Notifications