జగన్ సంచలన నిర్ణయం: ఆసుపత్రుల్లో వాటి రేటు ఫిక్స్: జిల్లాలవారీగా: యంత్రాగం పరుగులు
అమరావతి: ప్రాణాంతక కరోనా వైరస్ రాష్ట్రంపై పంజా విసురుతోంది. రోజూ వేల కొద్దీ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. మరణాలు కూడా అదే స్థాయిలో రికార్డవుతున్నాయి. ఇదివరకెప్పుడూ లేనంతగా కరోనా వైరస్ రాష్ట్రంలో విజృంభణ సాగిస్తుండటం ఆందోళనకు గురి చేస్తోంది. కరోనా వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి జగన్ సర్కార్.. రాత్రివేళ కర్ఫ్యూను సైతం అమల్లోకి తీసుకొచ్చింది. మాస్క్‌లను ధరించని వారిపై భారీగా జరిమానాలను విధిస్తోంది.

కార్పొరేట్ దోపిడీకి చెక్..
మరోవంక- ఇదే అవకాశం కొన్ని కార్పొరేట్ ఆసుపత్రులు, ప్రైవేటు ఆసుపత్రులు, క్లినక్‌లు, నర్సింగ్ హోమ్‌లు దోపిడీకి తెర తీశాయి. కరోనా వైరస్ సోకిన పేషెంట్ల నుంచి పెద్ద ఎత్తున ఫీజులను వసూలు చేస్తున్నాయనే ఫిర్యాదులు ప్రభుత్వానికి అందుతున్నాయి. కోవిడ్ నిర్ధారణ పరీక్షల కోసం ప్రభుత్వం ఇప్పటికే ఫీజును నిర్ధారించింది. అక్కడ ఏర్పడిన లోటును ఇతరత్రా పరీక్షల ద్వారా వసూలు చేస్తున్నారంటూ పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతుండటంతో జగన్ సర్కార్.. కీలక నిర్ణయాన్ని తీసుకుంది.

సీటీ/హెచ్ఆర్‌సీటీ స్కానింగ్ రేట్లు ఫిక్స్..
సీటీ/హెచ్ఆర్‌సీటీ స్కానింగ్‌లను నిర్వహించడానికి వసూలు చేయాల్సిన ఫీజును నిర్ధారించింది. సీటీ/హెచ్ఆర్‌సీటీ స్కానింగ్‌పై గరిష్ఠంగా 3,000 రూపాయలను మాత్రమే వసూలు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ కొద్దిసేపటి కిందటే ఉత్తర్వులను జారీ చేశారు. మాస్క్, స్ప్రెడ్ షీట్.. వంటి పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్‌మెంట్ (పీపీఈ)కు అయ్యే ఖర్చును కూడా ఈ 3,000 రూపాయల్లోనే చేర్చింది.

సీఎం డాష్‌బోర్డుతో అనుసంధానం..
ఈ మొత్తానికి మించి.. ఒక్క రూపాయిని అధికంగా వసూలు చేసినట్లు ఫిర్యాదులు అందినా- సంబంధిత ఆసుపత్రిపై కఠిన చర్యలను తీసుకుంటామని అనిల్ కుమార్ సింఘాల్ ఈ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. కార్పొరేట్ ఆసుపత్రులు, ప్రైవేటు క్లినిక్కులు, నర్సింగ్ హోమ్‌లు, డయాగ్నస్టిక్స్ సెంటర్లు, స్కానింగ్ సెంటర్లన్నీ ఈ నిబంధనను పాటించాల్సి ఉంటుందని తెలిపారు. దీనితోపాటు- రాష్ట్రంలోని ఆసుపత్రులు, డయాగ్నస్టిక్స్, స్కానింగ్ సెంటర్లు తమ పేరు, ఫోన్ నంబర్లు, సీటీ/హెచ్ఆర్‌సీటీ స్కానింగ్‌కు సంబంధించిన ఫొటో సైన్డ్ కాపీలను ముఖ్యమంత్రి డాష్‌బోర్డు http://dashboard.covid19.ap.gov.in/ctscanకు అనుసంధానించాల్సి ఉంటుందని ఆదేశించారు.

జిల్లాలవారీగా ప్రత్యేకాధికారులు..
దీనితోపాటు- జిల్లాలవారీగా 104 కాల్ సెంటర్లు, కోవిడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి ప్రత్యేకాధికారులను ప్రభుత్వం నియమించింది. శ్రీకాకుళం-మోహన్ రావు (సీపీఓ), విజయనగరం-సునీల్ రాజ్‌కుమార్, విశాఖపట్నం-ఆదితీ సింగ్, తూర్పు గోదావరి-గీతాంజలి శర్మ, పశ్చిమ గోదావరి-తాటిమాకుల రాహుల్ కుమార్ రెడ్డి, కృష్ణా-శోభిక ఎస్ఎస్, గుంటూరు-శుభమ్ బన్సల్, ప్రకాశం-అన్నపూర్ణ, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు-ఫర్మన్ అహ్మద్ ఖాన్, చిత్తూరు-అభిషేక్ కుమార్, అనంతపురం-మళ్లవరపు సూర్యతేజ, కడప-కొళ్లాబత్తుల కార్తీక్, కర్నూలు-నూరుల్ ఖమర్‌ను అపాయింట్ చేశారు. మోహన్ రావు, సునీల్ రాజ్‌కుమార్, అన్నపూర్ణ మినహా.. మిగిలిన వారందరూ ఐఎఎస్ అధికారులు.












Click it and Unblock the Notifications