పిఠాపురంలో కుటుంబానికి రూ.10వేలు?
దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. వీటితోపాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. ప్రధాన పార్టీలైన వైఎస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం, జనసేన, బీజేపీ వ్యూహ ప్రతివ్యూహాల్లో నిమగ్నమయ్యాయి. వైసీపీని ఎదుర్కొనేందుకు తెలుగుదేశం పార్టీ జనసేన, బీజేపీతో కలిసి కూటమిని ఏర్పాటు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా సెలబ్రిటీలు పోటీచేస్తున్న నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటి. పులివెందుల, కుప్పం కన్నా రాష్ట్ర ప్రజలందరి దృష్టి ప్రస్తుతం పిఠాపురంపైనే ఉందంటే అతిశయోక్తి కాదు.
ఓడించడమే లక్ష్యం
జనసేనాని పవన్ కల్యాణ్ ను ఎట్టి పరిస్థితుల్లోనైనా ఓడించాలనే దృక్పథంతో వైసీపీ ఉంది. పవన్ అసెంబ్లీలో అడగు పెట్టకూడదు అనే ఏకైక లక్ష్యంతో ఆ పార్టీ ముందుకు సాగుతోంది. వైసీపీ తరఫున వంగా గీత బరిలో నిలిచారు. మరోవైపు పవన్ కు మద్దతుగా తెలుగుదేశం పార్టీ నాయకుడు వర్మ నియోజకవర్గంలో రాజకీయాలను పర్యవేక్షిస్తున్నారు. వైసీపీ వ్యూహాలకు ధీటుగా జనసేన కూడా ప్రతివ్యూహాలను అమలు చేస్తోంది .

సానుభూతి పెంచేందుకే
పిఠాపురంలో పవన్ కల్యాణ్ ను ఓడించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కుటుంబానికి రూ.10వేల చొప్పున పంపిణీ చేస్తోందంటూ ప్రచారం జరుగుతోంది. నియోజకవర్గంలో జనసేన అభిమానుల ఇళ్లను మినహాయించి మిగతా ఇళ్లల్లో రూ.10వేల చొప్పున పంచుతున్నారంటూ జనసేన నాయకులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం అందరూ సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారు. ఇటువంటిదేమైనా జరిగితే క్షణాల్లోనే తెలిసిపోతుందని, అటువంటిదేమీ లేదని, ఇదంతా పవన్ పై సానుభూతి పెంచేందుకు జనసేన ఆడుతున్న నాటకమంటూ వైసీపీ కొట్టిపారేస్తోంది.
వార్ వన్ సైడ్
పిఠాపురంలో గెలవడానికి ఉన్న ఏ చిన్న అవకాశాన్ని జనసేన వదులుకోవడానికి ఇష్టపడటంలేదు. కుటుంబానికి రూ.10వేల చొప్పున పంచుతున్నారన్న మాటతో పాజిటివ్ ఓటింగ్ పెంచేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే పిఠాపురంలో వార్ వనసైడ్ అన్నట్లుగా ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వైసీపీ ఓటర్లకు భారీ ఎత్తున తాయిలాలు పంచుతోందంటూ ప్రచారం చేస్తూ ఆ పార్టీని ఆత్మరక్షణ ధోరణిలోకి నెట్టేస్తోంది. జనసేన ఒక వ్యూహం ప్రకారం వైసీపీని అష్టదిగ్బంధనం చేస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications