వేదాలతో ప్రపంచ శాంతి, అదే మనకు శ్రీరామ రక్ష: పాఠశాల ప్రారంభోత్సవంలో ప్రణబ్
పశ్చిమగోదావరి: వేదాల్లో ప్రపంచ శాంతిని కలిగించే శక్తి ఉందని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలోని ఐ భీమవరంలో తిరుమల తిరుమతి దేవస్థానం నిర్మించిన వేదపాఠశాల భవన సముదాయాన్ని ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా గోశాలను సందర్వించిన ఆయన వేదపాఠశాల విద్యార్థులతో ముచ్చటించారు.
అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. వేద పాఠశాల ప్రారంభోత్సవంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. వేద పాఠశాలల అభివృద్ధికి టిటిడి చేస్తున్న కృషిన ఆయన అభినందించారు. వేదాలు ప్రపంచ శాంతికి అవసరమని అన్నారు.

మహానుభావులు అందించిన వేదాలను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన చెప్పారు. ‘లోకా సమస్తా సుఖినోభవంతు' అని వేదాల్లో ఉందని, అదే మనకు శ్రీరామ రక్ష అని ప్రణబ్ ముఖర్జీ తెలిపారు. తక్షశిల, నలంద, విక్రంపురి లాంటి విశ్వవిద్యాలయాలు 1300 సంవత్సరాలకుపైగా ప్రపంచానికి గురువుగా ఉన్నాయని చెప్పారు.
సంస్కృతి, సంప్రదాయాలకు వేద పాఠశాలలు ప్రతీకగా నిలుస్తున్నాయని ప్రణబ్ అన్నారు. గోదావరి, కృష్ణ, నాగార్జునకొండ, అమరావతి లాంటి ప్రదేశాలు కూడా వేదాల ప్రాముఖ్యతను తెలిపాయని చెప్పారు.
వేద పాఠశాలలను అభివృద్ధి చేసి, ఆర్థికంగా అండగా నిలుస్తున్న టిటిడికి మరోసారి ప్రణబ్ ముఖర్జీ అభినందించారు. రాష్ట్రంలో ఏడు వేద పాఠశాలలు నిర్వహించడం గొప్ప విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ నర్సింహన్, ఏపి సీఎం చంద్రబాబునాయుడు, పలువురు మంత్రులు పాల్గొన్నారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రణబ్
రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ శుక్రవారం సాయంత్రం తిరుమలకు వెళ్లారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి రోడ్డుమార్గంలో ఆయన తిరుమల చేరుకొని శ్రీవారిని దర్శించుకున్నారు. రాష్ట్రపతి వెంట గవర్నర్ నరసింహాన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉన్నారు.












Click it and Unblock the Notifications