అందరికీ నమస్కారం, దేశానికి ఏపీ ఎంతో చేసింది: కోవింద్, బాబుపై ప్రశంసలు
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు శుక్రవారం ఎస్వీ యూనివర్సిటీలో పౌర సన్మానం జరిగింది. ఈ సందర్భంగా రామ్‌నాథ్ తన ప్రసంగం ప్రారంభంలో అందరికీ నమస్కారం అన్నారు.
తిరుపతి: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు శుక్రవారం ఎస్వీ యూనివర్సిటీలో పౌర సన్మానం జరిగింది. ఈ సందర్భంగా రామ్‌నాథ్ తన ప్రసంగం ప్రారంభంలో అందరికీ నమస్కారం అన్నారు.

ఎంతోమంది గొప్ప వ్యక్తులు
ఆంధ్రప్రదేశ్ ఎంతోమంది గొప్ప వ్యక్తులకు జన్మను ఇచ్చిందని రామ్‌నాథ్ చెప్పారు. ఎన్టీఆర్, పీవీ నర్సింహా రావు వంటి గొప్ప వ్యక్తులు జన్మించారన్నారు. ఏపీ వేగంగా అభివృద్ధి చెందుతోందని కితాబిచ్చారు. ఏపీకి రావడం గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు.

బాబు హయాంలో కొత్త ప్రయాణం
ఏపీ ఐటీ కంపెనీలు దేశవ్యాప్తంగా ఫేమస్ అని కోవింద్ తెలిపారు. చంద్రబాబు హయాంలో ఏపీలో కొత్త ప్రయాణం ప్రారంభమైందని చెప్పారు. ఐటీ, మౌలిక సదుపాయాలకు ఏపీ పెట్టింది పేరు అన్నారు. పేదల అభివృద్ధికి చంద్రబాబు అన్ని చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు.

ఏపీ దేశానికి ఎంతో చేసింది, కేంద్రం సహకారం
తన రెండో పర్యటననే తిరుపతి కావడం ఆనందంగా ఉందని కోవింద్ చెప్పారు. ఏపీ దేశానికి ఎంతో సేవ చేసిందని తెలిపారు. కేంద్రం నవ్యాంధ్ర అభివృద్ధికి బాగా సహకరిస్తోందని చెప్పారు.

చంద్రబాబు మాట్లాడుతూ..
తాను చదువుకున్న ఎస్వీయూకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రావడం తనకు ఆనందంగా ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంలాగే రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ జీవితం విద్యార్థులకు ఆదర్శమని అన్నారు. ఓ పేద కుటుంబంలో పుట్టిన రామ్‌నాథ్ కోవింద్ ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఇప్పుడు అత్యున్నత పదవిని అలంకరించారన్నారు.

ప్రజాస్వామ్య దేశం ప్రత్యేకత
ఒక సాధారణ మనిషిని దేశ అత్యున్నత పదవిలో నిలబెట్టడం ప్రజాస్వామ్య దేశ ప్రత్యేకత అని చెప్పారు. దేశానికి రాష్ట్రపతి అయినా ఆయన ఎంతో వినమ్రతతో ఉంటారని చంద్రబాబు అన్నారు. కొంతమంది వ్యక్తులు ఏ పదవి అలంకరించినా ఆ పదవికి వన్నె తెస్తారని, అందులో రామ్‌నాథ్ కోవింద్ ఒకరన్నారు.












Click it and Unblock the Notifications