వైసీపీ-టీడీపీ మధ్య ఆ అనుబంధం: బయట పెట్టిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
అమరావతి: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ-ప్రతిపక్ష తెలుగుదేశం మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందనడంలో సందేహాలు అక్కర్లేదు. ఈ రెండు పార్టీలు ఉప్పు-నిప్పుల్లా ఉంటాయి. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం ఒక్కటే కావడం, పవన్ కల్యాణ్ సారథ్యంలోని జనసేన దానికి అనధికారికంగా అనుబంధ పార్టీగా కొనసాగుతోందంటూ వార్తలు వస్తోన్న నేపథ్యంలో- ఇక అందరి గురి వైఎస్ఆర్సీపీపైనే ఉంది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తీసుకునే ప్రతి చిన్న నిర్ణయాన్నీ తప్పుపట్టడం టీడీపీ ప్రధాన డ్యూటీగా మారిందనేది చాలా సందర్భాల్లో రుజువైంది కూడా.

విధాన నిర్ణయాలకు బద్ధ వ్యతిరేకం..
ప్రభుత్వం తీసుకునే విధానపరమైన నిర్ణయాలను తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి నారా లోకేష్ సహా క్యాడర్ మొత్తం తప్పుపట్టడం, వాటిని న్యాయస్థానంలో సైతం సవాల్ చేయడం తెలిసిన విషయమే. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన, ఇళ్ల పట్టాల పంపిణీ, మూడు రాజధానుల ఏర్పాటు.. ఇలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తీసుకునే ప్రతి విధానపరమైన నిర్ణయాన్నీ తప్పుపడుతోంది టీడీపీ. వాటిపై ప్రజల్లో ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయనే విషయాన్ని ఏ మాత్రం పట్టించుకోవట్లేదు.

రాష్ట్రపతి ఎన్నికల్లో..
అలాంటి వైసీపీ-టీడీపీ ఏకతాటిపైకి వచ్చిన అంశం- రాష్ట్రపతి ఎన్నిక. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం బలపరిచిన ద్రౌపది ముర్మును ఈ రెండు పార్టీలు బలపరిచాయి. ద్రౌపది ముర్ము ఏపీకి వచ్చిన సమయంలో వైఎస్ జగన్, చంద్రబాబు నాయుడు ఆమెను దగ్గరుండి ఆహ్వానించారు. సాదర స్వాగతం పలికారు. ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేసి మరీ సన్మానించారు. తమ మద్దతును తెలియజేశారు. రాష్ట్రం విషయంలో ఉప్పు-నిప్పుల్లా ఉండే వైసీపీ-టీడీపీ.. రాష్ట్రపతి ఎన్నిక విషయంలో మాత్రం ఏకతాటిపైకి రావడం రాజకీయ విశ్లేషకులను ఆశ్చర్యానికి గురి చేసింది.
సామాజిక న్యాయం పేరుతో..
సామాజిక న్యాయం అనే పేరుతో ఈ రెండు పార్టీలు దగ్గరయ్యాయనే వాదన ఉంది. ద్రౌపది ముర్ము గిరిజన మహిళ కావడం వల్ల ఆమె గానీ, బీజేపీ లేదా ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల నాయకులు గానీ అడక్కముందే తాము మద్దతు ఇచ్చామని టీడీపీ నాయకులు బాహటంగానే సమర్థించుకుంటోన్నారు. సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వీవీ లక్ష్మీనారాయణ.. దీన్ని తప్పుపట్టారు. ఈ రెండు పార్టీల వైఖరిపై విమర్శలు గుప్పించారు. సామాజిక న్యాయం పేరుతో వైసీపీ-టీడీపీ నాటకాలు ఆడుతున్నాయంటూ ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రయోజనాలను విస్మరించాయమని మండిపడ్డారు.

2012 నాటి రాష్ట్రపతి ఎన్నికలు..
2012 నాటి రాష్ట్రపతి ఎన్నికలను జేడీ లక్ష్మీనారాయణ ప్రస్తావించారు. అప్పటి ఎన్నికల్లో పోటీ చేసిన పీఏ సంగ్మా కూడా షెడ్యూల్ తెగలకు చెందిన నాయకుడేనని గుర్తు చేశారు. అప్పట్లో వైఎస్ఆర్సీపీకి గానీ, తెలుగుదేశం పార్టీకి గానీ సామాజిక న్యాయం గుర్తుకు రాలేదా? అని నిలదీశారు. సామాజిక న్యాయం అప్పుడేమైందని సూటిగా ప్రశ్నించారు. నాటి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ యూపీఏ అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీకి ఓటు వేసిందని, తెలుగుదేశం దూరంగా ఉందని పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రయోజనాల కోసం..
ఇప్పుడు సామాజిక న్యాయం గురించి మాట్లాడుతోన్న వైసీపీ, టీడీపీ ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన పీఏ సంగ్మాకు ఎందుకు ఓటు వేయలేదని చెప్పారు. సామాజిక న్యాయం పేరిట రాజకీయ నాటకం ఆడుతున్నాయని జేడీ లక్ష్మీనారాయణ ధ్వజమెత్తారు. ఈ నాటకాలకు బదులుగా రాష్ట్ర ప్రయోజనాల కోసం, ప్రత్యేక హోదా కోసం ఎందుకు పోరాడకూడదని అన్నారు. రాష్ట్రానికి న్యాయం చేస్తే గానీ, ప్రత్యేక హోదా ఇస్తేనే రాష్ట్రపతి ఎన్నికలలో ఓటువేయాలని జేడీ లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications