నిర్మాత సురేష్ బాబు సంచలన వ్యాఖ్యలు
కొద్దిరోజులుగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తెలుగు, తమిళ సినిమాల విడుదలకు సంబంధించి వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి సీజన్ లో తెలుగు సినిమాలకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని తెలుగు నిర్మాతల మండలి ఇటీవలే ఒక లేఖను కూడా విడుదల చేసింది. దీనికి కారణం దిల్ రాజు తన డబ్బింగ్ సినిమా వారసుడును సంక్రాంతికే విడుదల చేయాలని నిర్ణయించడం. దీంతోపాటు థియేటర్ల ఓనర్లతో ముందుగానే అగ్రిమెంటు కూడా చేసుకున్నారు.
సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబు నిర్మాతల మండలి నిర్ణయంపై స్పందించారు. ఇతర భాషల సినిమాలను ఎవరూ ఆపలేరని, సంక్రాంతి సీజన్ లో అన్ని సినిమాలు నడుస్తాయన్నారు. తెలుగు సినిమాలకు హద్దులు లేవని, చెరిగిపోయాయని, మన సినిమాను ఏ భాషలో కూడా చులకనగా చూడటంలేదన్నారు. చెన్నైలో ఆర్ఆర్ఆర్ విడుదల చేసినప్పుడు కూడా అక్కడివారు ఇబ్బంది పడ్డారని, స్థానికంగా చిన్న చిన్న సమస్యలు వస్తుంటాయని, మంచి సినిమా అయితే ఎక్కు థియేటర్లలో ఆడిస్తారన్నారు.

సినిమా బాలేకపోతే తర్వాతరోజే తీసేస్తారని, ఇదొక వ్యాపారమన్నారు. ఎవరిష్టం వారిదని, ఆడుతుందనే నమ్మకం ఉన్న సినిమాకు ఎక్కు థియేటర్లు ఇస్తారని, అది ఏ భాషా సినిమా అని ఎవరు చూడరన్నారు. మన తెలుగు సినిమాలు కూడా ఇతర భాషల్లో విడుదలై విజయం సాధిస్తున్నాయన్నారు.
బాలకృష్ణ వీరసింహారెడ్డి, చిరంజీవి వాల్తేర్ వీరయ్య సినిమాలు జనవరి 12, 13 తేదీల్లో విడుదల కాబోతున్నాయి. అయితే జనవరి 12వ తేదీన దిల్ రాజు తన సినిమా వారసుడును విడుదల చేస్తుండటమే వివాదానికి కారణమైంది. నిర్మాతల మండలి సంక్రాంతి సీజన్ కు స్థానిక సినిమాలకు మొదటి ప్రాధాన్యమిచ్చి, డబ్బింగ్ సినిమాలకు రెండో ప్రాధాన్యతనివ్వాలంటూ ఒక లేఖ విడుదల చేసింది. దీనిపై సురేష్ బాబు స్పందించారు.












Click it and Unblock the Notifications