YS Viveka case:వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్ట్ - పులివెందులలో కీలక పరిణామాలు..!!
వివేకా హత్య కేసులో వైఎస్ భాస్కర రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసింది. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్రెడ్డిని ఆదివారం తెల్లవారుజామున విచారించిన అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి వాహనంలో హైదరాబాద్‌కు తీసుకువస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం సీబీఐ మేజిస్ట్రేట్ ఇంటి వద్ద హాజరు పరచనున్నారు. ఇదే సమయంలో వైఎస్ భాస్కర్ రెడ్డి అనచరులు పులివెందులలో నిరసనకు దిగారు. శాంతియుతంగా ర్యాలీ నిర్వహించారు. జిల్లా వైసీపీ నేతలు భాస్కరరెడ్డి అరెస్ట్ ను ఖండించారు.
వివేకా హత్య కేసులో సీబీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే వైఎస్ భాస్కర్ రెడ్డి పైన అభియోగాలు నమోదు చేసిన సీబీఐ ఈ రోజు ఉదయం పులివెందులలో భాస్కరరెడ్డిని అరెస్ట్ చేసింది. భాస్కర్రెడ్డి అరెస్ట్ మెమోను ఆయన భార్య లక్ష్మీకి అందజేశారు. అలాగే వైఎస్ వివేకా హత్య కేసులో భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసినట్లు సీబీఐ అధికారులు కుటుంబ సభ్యులకు తెలిపారు. భాస్కర్ రెడ్డిపై సెక్షన్ 120బి, రెడ్ విత్ 201, 302 ఐపీసీ కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు. వివేకా హత్య కేసులో భాస్కర్ రెడ్డి పాత్ర కీలకంగా ఉందని పేర్కొన్నారు. వివేకా హత్యకు ముందు.. తరువాత నిందితులను భాస్కర్ రెడ్డి ఇంటికి పిలిచి మాట్లాడారని తెలిపారు.

120బి కుట్ర, 302 ముర్డర్, 201 ఆధారాలు చేరిపివేయడం వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సీబీఐ అధికారులు తెలిపారు.సాక్ష్యాలు ధ్వంసం చేశారనే ఆరోణల నేపథ్యంలో ఉదయ్‌ను కూడా సీబీఐ ఇప్పటికే అరెస్ట్ చేసింది. తెల్లవారుజామున అధికారులు రెండు వాహనాల్లో పులివెందులలోని ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. అవినాష్‌రెడ్డి తండ్రి భాస్కర్రెడ్డిని విచారించిన అధికారులు.. ఆయనను అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి వాహనంలో హైదరాబాద్‌కు బయలుదేరారు. మొన్న ఉదయకుమార్ రెడ్డి.. నేడు భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఇక సీబీఐ అధికారులు వరుస అరెస్టుల పర్వం కొనసాగించే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో పులివెందులలో హైటెన్షన్ నెలకొంది.

వైఎస్ భాస్కరరెడ్డి నివాసానికి సీబీఐ అధికారులు చేరుకున్న విషయంలో తెలియగానే పెద్ద సంఖ్యలో అనుచరులు అక్కడకు వచ్చారు. అరెస్ట్ తరువాత పెద్ద సంఖ్యలో అనుచరులు పులివెందులలో ర్యాలీ నిర్వహించారు. శాంతియుత ర్యాలీతో నిరసన వ్యక్తం చేసారు. వివేకా హత్య కేసులో భాస్కరరెడ్డికి సంబంధం లేదని వైసీపీ నేతలు చెబుతున్నారు. కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నారని పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇటు హైకోర్టులో భాస్కర రెడ్డి దాఖలు చేసిన పిటీషన్ పైన విచారణ కొనసాగుతోంది. భాస్కరెడ్డి రిమాండ్ రిపోర్టులో సీబీఐ కీలక అంశాలను వెల్లడించే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications