సొంత జిల్లాలో చంద్రబాబుకు చుక్కలు చూపారు..!!
చిత్తూరు: తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు.. ప్రస్తుతం రాయలసీమ జిల్లాల్లో పర్యటిస్తోన్నారు. తొలుత కర్నూలు, నంద్యాల, కడప, అనంతపురం జిల్లాల్లో పర్యటించారు. రోడ్ షోల్లో ప్రసంగించారు. తాజాగా తన సొంత జిల్లా చిత్తూరులో అడుగుపెట్టారు. పుంగనూరులో రోడ్ షో, బహిరంగ సభను నిర్వహించారు.
రాయలసీమలో నీటి ప్రాజెక్టుల నిర్మాణం స్తంభించిపోయిందనే ఉద్దేశంతో ఆయన ఈ పర్యాటనను చేపట్టారు. ప్రాజెక్టులను సందర్శించడానికి ఈ పర్యటనను తలపెట్టారు. పెన్నా టు వంశధార పేరుతో దీన్ని నిర్వహిస్తోన్నారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో రాష్ట్రాన్ని, రాయలసీమను తామే అభివృద్ధి చేశామనేది చంద్రబాబు వాదన.

ఈ పర్యటనలో భాగంగా ఇవ్వాళ ఆయన పుంగనూరుకు చేరుకున్నారు. ఇది- అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గం. వైఎస్ఆర్సీపీకి ఇది కంచుకోట. పులివెందుల తరహాలోనే చంద్రబాబుకు ఇక్కడ కూడా నిరసన పర్వం ఎదురైంది.
నియోజకవర్గానికి చెందిన వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పుంగనూరులో నిరసన ప్రదర్శనలను నిర్వహించారు. నల్లజెండాలను ఎగురవేశారు. గో బ్యాక్ చంద్రబాబు అంటూ ప్లకార్డులను ప్రదర్శించారు. చంద్రబాబు రాయలసీమ ద్రోహి అంటూ నినాదాలు చేశారు. రాయలసీమకు మంజూరైన ఎయిమ్స్ వంటి కొన్ని భారీ ప్రాజెక్టులను సైతం అమరావతికి తరలించాడంటూ ధ్వజమెత్తారు.

హంద్రీ-నీవా కోసం కేటాయించిన మోటార్ పంపులను కూడా పట్టిసీమ కోసం చంద్రబాబు ఎత్తుకెళ్లాడంటూ మండిపడ్డారు. రాయలసీమలో ఒక్క నీటి ప్రాజెక్టుకు కూడా చంద్రబాబు శంకుస్థాపన చేయలేదని, వాటిని ప్రారంభించిన దాఖలాలు కూడా లేవంటూ స్థానికులు ఆరోపించారు. అలాంటి చంద్రబాబు ఇప్పుడు రాయలసీమ సంక్షేమం పేరుతో కొత్త నాటకానికి తెరతీశారంటూ విమర్శించారు.
స్థానికులు, వైఎస్ఆర్సీపీ నాయకులు పెద్ద ఎత్తున నల్ల జెండాలతో ర్యాలీని తీశారు. నల్ల బెలూన్లనూ ఎగురవేశారు. ఈ ఘటనలతో పుంగనూరులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నారు.












Click it and Unblock the Notifications