ఏపీలో క్రైస్తవుల తీవ్ర నిరసనలు-హైదరాబాద్ కు పాస్టర్ ప్రవీణ్ మృతదేహం..!
ఏపీలోని రాజమండ్రి సమీపంలో హైదరాబాద్ కు చెందిన పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతదేహం లభించిన వ్యవహారం చినికి చినికి గాలివానగా మారుతోంది. పోలీసులు దీన్ని రోడ్డు ప్రమాదంగా చెప్తుండగా.. క్రైస్తవ మత బోధకులు మాత్రం ఇది హత్యే అని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తీవ్రమవుతున్నాయి. దీంతో ఆయన మృతదేహాన్ని ఇవాళ పోస్టుమార్టం అనంతరం హైదరాబాద్ కు తరలించారు.
పగడాల ప్రవీణ్ మృతిపై క్రైస్తవ సమాజానికి అనేక అనుమానాలు ఉన్నాయని ఈ అనుమానాలన్నిటిని ప్రభుత్వమే నిష్పక్షపాతంగా విచారణ జరిపి నివృత్తి చేయాలని విజయవాడలోని బ్లెస్సింగ్ టెంపుల్ పాస్టర్ రూబేన్ అన్నారు. ఇవాళ సాయంత్రం క్రైస్తవులతో కలిసి విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డు ఫుడ్ జంక్షన్ వద్ద నుండి పడమలరేవు వరకు ఆయన భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్వచ్ఛందంగా వాము పక్ష పార్టీ నాయకులతో పాటు ఐ ఎఫ్ టీ యూ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సంఘీభావం తెలిపారు.

క్రైస్తవ సమాజం కొరకు తన యొక్క గళాన్ని సోషల్ మీడియా, మీడియా వేదికగా నిరంతరం ప్రశ్నిస్తున్న దైవజనులు పగడాల ప్రవీణ్ నిన్న తెల్లవారుజామున అకస్మికంగా రాజమండ్రి నుండి రాజానగరం వెళ్తుండగా జరిగిన ప్రమాదంపై దర్యాప్తు వేగవంతంగా నిర్వహించి దోషుల్ని కఠినంగా శిక్షించాలన్నారు. కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ కూడా ఇప్పటికే ఘటనపై స్పందించి పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేయడాన్ని హర్షిస్తున్నట్లు తెలిపారు.
ప్రభుత్వం నిష్పక్షపాతంగా విచారణ జరిపి దోషులను శిక్షించేంతవరకు క్రైస్తవ సమాజం నిరసనలు తెలియజేస్తూ ఉంటుందని పేర్కొన్నారు.
మరోవైపు పాస్టర్ ప్రవీణ్ మృతదేహానికి పోస్టుమార్దం పూర్తి చేసిన తర్వాత మృతదేహాన్నిహైదరాబాద్ తరలించారు. ఇప్పటికే రెండు సీసీ ఫుటేజ్ లు లభించాయని పోలీసులు తెలిపారు. సోమవారం అర్ధరాత్రి 11.31 నుంచి 11.42 నిమిషాల వరకూ 12 నిమిషాలు కీలకం అని పోలీసులు చెప్తున్నారు. 11 గంటల 42 నిమిషాలకు ఒక కారుతోపాటు ఐదు వాహనాలు ప్రవీణ్ బుల్లెట్ ని దాటుకొని వెళ్లాయని తెలిపారు.. రెడ్ కలర్ కారు, ప్రవీణ్ ప్రయాణిస్తున్న బుల్లెట్ ఒకేసారి వెళ్లాయని ఈ కార్ వివరాలు సేకరిస్తున్నామని పోలీసులు చెప్తున్నారు..












Click it and Unblock the Notifications