వివేకా హత్య కేసులో మరో కీలక పరిణామం..!!
వైఎస్ వివేకా కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికల సమయంలో వివేకా హత్య కేసు ప్రచార అంశంగా మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ కేసులో న్యాయం చేయాలని వివేకా కుమార్తె సునీత అమరావతిలో సీఎం చంద్రబాబును కోరారు. అటు కోర్టులోనూ ఈ కేసు విచారణలో ఉంది. ఇక, తాజాగా ఈ కేసులో వివేకా పీఏగా పని చేసిన క్రిష్ణారెడ్డిని పోలీసులు విచారించారు. దీంతో, త్వరలోనే ఆసక్తి కర పరిణామాలు చోటు చేసుకుంటాయనే చర్చ మొదలైంది.
వైఎస్ వివేకా హత్య కేసు వ్యవహారం మరో సారి తెర మీదకు వచ్చింది. పులివెందుల పోలీసులు వివేకా పీఏ కృష్ణారెడ్డిని విచారించారు. కృష్ణారెడ్డి గతంలో వివేకా కుమార్తె సునీత, ఆమె భర్త రాజశేఖర్‌రెడ్డి, గతంలో సీబీఐ ఎస్పీ రామ్ సింగ్ లపై పులివెందుల కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ దాఖలు చేశారు. ఈ ఫిర్యాదుతో ఆ ముగ్గురి పైన కేసు నమోదైంది. దీంతో, పోలీసులు ఈ రోజు కృష్ణారెడ్డి వాంగ్మూలాన్ని రికార్డు చేసారు. న్యాయవాదుల సమక్షంలో కృష్ణారెడ్డి నుంచి స్టేట్మెంట్ తీసుకున్నారు. పులివెందుల డీఎస్పీ అడిగే ప్రశ్నలు ఆయన చెప్పే సమాధానాలను ఆడియో, వీడియో రికార్డ్ చేశారు.

మరోవైపు ఈ కేసులో ఫైనల్ ఛార్జీషీట్ కోర్టులో దాఖలు చేయాల్సి ఉంది. దీంతో, కొద్ది రోజుల క్రితం వైఎస్ సునీత సీఎం చంద్రబాబు, హోం మంత్రి అనితను కలిసి తన తండ్రి హత్య కేసులో విచారణ వేగవంతం అయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దోషులను శిక్షించాలని అభ్యర్దిం చారు. ఈ క్రమంలోనే రెండు రోజుల కిందట జిల్లా ఎస్పీని కలిసి మరోమారు విన్నవించారు. ఈ మొత్తం వ్యవహారంలో పూర్వాపరాలు తెలుసుకునేందుకు కృష్ణారెడ్డి వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డ్ చేయడంతో కీలక పరిణామంగా భావిస్తున్నారు. క్రిష్ణారెడ్డి దాఖలు చేసిన ప్రయివేటు కంప్లైంట్ లో కోర్టు లేవనెత్తిన కొన్ని అంశాల పైన విచారణ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.












Click it and Unblock the Notifications