పులివెందుల ఫలితం తేలిపోయిందా ? టీడీపీ అభ్యర్ధి, వైసీపీ ఎంపీ షాకింగ్..!
ఏపీలో ఇవాళ జరుగుతున్న స్థానిక సంస్థల ఉపఎన్నికల్లో పులివెందుల జడ్పీటీసీ పోరు సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. జగన్ సొంత నియోజకవర్గంలో జరుగుతున్న ఈ పోరును టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎమ్మెల్సీ బీటెక్ రవి భార్య లతారెడ్డిని బరిలోకి దింపింది. అటు వైసీపీ మాత్రం చనిపోయిన జడ్పీటీసీ కుమారుడు తుమ్మల హేమంత్ రెడ్డితో పోటీ చేయిస్తోంది. అయితే ఇవాళ ఉదయం నుంచీ దాడులు, ప్రతిదాడులతో పులివెందుల హీటెక్కింది.
పోలీసులు అధికార పార్టీకి వంత పాడుతున్నారని ఆరోపిస్తూ ఆందోళనకు దిగుతున్న వైసీపీ నాయకుల్ని ముందస్తు అరెస్టులు చేశారు. అటు టీడీపీ కూడా ఈ ఎన్నికల్లో గెలుపు కోసం సర్వశక్తులొడ్డుతోంది. మధ్యాహ్నం 12 గంటలకు 45 శాతం పోలింగ్ ముగిసిన ఈ ఉపఎన్నికల్లో గెలుపు తమదేనని టీడీపీ ధీమా వ్యక్తం చేస్తోంది. అయితే వైసీపీ మాత్రం ఇందుకు భిన్నంగా ఎన్నికలను టీడీపీ పోలీసుల సాయంతో హైజాక్ చేస్తోందని ఆరోపిస్తూ విజయవాడలో ఈసీ కార్యాలయం ముందు ఆందోళనకు దిగింది.

మరోవైపు పులివెందులలో జడ్పీటీసీ ఉపఎన్నిక జరుగుతున్న తీరుపై టీడీపీ అభ్యర్ధి మారెడ్డి లతారెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు. గత 40 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా పులివెందులలో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని లతారెడ్డి తెలిపారు. తన ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత మాట్లాడిన ఆమె.. అక్కడక్కడా వైసీపీ గొడవలకు ప్రయత్నిస్తోందని, మొత్తం మీద ఎన్నికలు మాత్రం ప్రశాంతంగా జరుగుతున్నాయని వెల్లడించారు.

అయితే పోలీసులు ఇవాళ ఉదయం అరెస్టు చేసిన వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి మాత్రం కూటమితో పాటు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో టీడీపీ ప్రతీ చోటా అక్రమాలకు పాల్పడుతోందని, కాబట్టి ఈ ఎన్నికను ఈసీ రద్దు చేసి తిరిగి కొత్తగా ఎన్నిక నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. దీన్ని బట్టి చూస్తే పులివెందులలో టీడీపీ గెలుపుకు ముందుగానే బాటలు వేసుకున్నట్లు అర్దమవుతోంది. వైసీపీ ఓటమి ఖరారైందన్న చర్చ జరుగుతోంది.












Click it and Unblock the Notifications