పవన్ కి పురందేశ్వరి ఫోన్, కీలక నిర్ణయం - టీడీపీతో పొత్తు పై క్లారిటీ..!!
ఏపీలో పొత్తుల వ్యవహారం ఇప్పుడు కీలక మలుపులు తిరుగుతోంది. ఎన్డీఏ సమావేశానికి పవన్ హాజరవ్వటం..టీడీపీకి పిలుపు లేకపోవటంతో పొత్తు రాజకీయం మరింత ఆసక్తి కరంగా మారింది. ఇదే సమయంలో ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి జనసేనాని పవన్ కు ఫోన్ చేసారు. పవన్ తో త్వరలో కలిసి భవిష్యత్ ఐక్య కార్యాచరణ డిసైడ్ చేస్తామని పురందేశ్వరి చెప్పారు. ఇదే సమయంలో పొత్తుల పైన కీలక వ్యాఖ్యలు చేసారు.
పొత్తుల విషయంపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి స్పందించారు. పొత్తుల విషయం తమ కేంద్ర నాయకత్వం చూసుకుంటుందని తెలిపారు. జనసేన తమ మిత్రపక్షమని స్పష్టం చేసారు. తాను పవన్ తో మాట్లాడిన విషయం నిర్ధారించారు. త్వరలో కూర్చొని మాట్లాడుకుంటామని వెల్లడించారు. ఏపీపై విభజన నాటికి రూ.97వేల కోట్ల భారం ఉందని చెప్పారు. ఐదేళ్ల టీడీపీ పాలనలో రూ.2,65,365 కోట్లు అప్పు చేశారని.. నలభై వేల కోట్లు కాంట్రాక్టర్‌లకు బిల్లులు చెల్లించలేదని అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి జులై వరకు నాలుగేళ్లల్లో రూ.7,14,631 కోట్లు అప్పు చేశారన్నారు. రూ.2లక్షల 39వేల 716 కోట్లు అధికారికంగా, రూ.4లక్షల 74వేల 315 కోట్లు అనధికారికంగా అప్పు తెచ్చారన్నారు. ఈ అనధికార అప్పే నేడు ఏపీ అభివృద్ధికి నిరోధకంగా మారిందని వెల్లడించారు.

తీసుకున్న అప్పులకు యాభై వేలకోట్ల రూపాయలు వడ్డీ కింద కడుతున్నారని తెలిపారు. అనధికారికంగా తీసుకువస్తున్న అప్పులపై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మద్యంపై రాబోయే ఆదాయం చూపి అప్పు తేవడం దేశంలో ఎక్కడా చూడలేదన్నారు. ప్రభుత్వం ఆస్తులను తనఖా పెట్టి డబ్బులు తేవడం చూస్తే జగన్మోహన్ రెడ్డి తీరు అర్ధం అవుతుందని తెలిపారు. అప్పులు తెచ్చి పనులు చేసిన కాంట్రాక్టర్‌లు వడ్డీలు కట్టలేక ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు. గ్రామ సర్పంచ్‌ను ప్రజలు ఎన్నుకుంటే వారికి విలువ లేకుండా చేశారన్నారు. సర్పంచ్‌ల ఖాతాల్లో వేసిన డబ్బులను మళ్లించిన ఘతన ఈ ప్రభుత్వానిదే అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీజేపీ ప్రభుత్వం జగన్‌కు అండగా ఉందనేది అపోహ మాత్రమే అని... అధికారికంగా తీసుకున్న అప్పుల వరకే కేంద్రం బాధ్యత అని స్పష్టం చేశారు. అనధికార అప్పులకు కేంద్రానికి సంబంధం లేదన్నారు. ఆర్థిక వ్యవస్థపై జగన్ ప్రభుత్వాన్ని కేంద్రం హెచ్చరిస్తూనే ఉందన్నారు. జగన్ ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో లాక్కుంటున్నారని విమర్శించారు. ఈ అంశాలను మంత్రి నిర్మలా సీతారామన్‌కు వివరిస్తామని పురంధేశ్వరి పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా నేడు సర్పంచ్‌లు ఒకే వేదికపైకి వచ్చి పోరాటం చేస్తున్నారని పురందేశ్వరి వ్యాఖ్యానించారు. బెంగుళూరులో జరిగిన సమావేశంలో విభిన్న సిద్దాంతాల పార్టీలు కలిశాయన్నారు. ఖర్గే దేశం కోసం కాకుండా బీజేపీని ఓడించడానికి వచ్చామని చెప్పారని పురంధేశ్వరి తెలిపారు.












Click it and Unblock the Notifications