చంద్రబాబుకు పురంధేశ్వరి కౌంటర్: రోజాకు డొక్కా సలహా
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం నిధులు ఇవ్వడం లేదనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి వాదనకు బిజెపి నేత, మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి కౌంటర్ ఇచ్చారు. ఏపీకి కేంద్రం నిధులివ్వడంలేదన్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని ఆమె సూచించారు.
తమ పార్టీ పథకాలను కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. పంట బీమా విధానాన్ని సరళీకృతం చేసింది తమ పార్టీయేనని, ఖర్చు చేసిన నిధులకు ఎపి ప్రభుత్వం ప్రమాణపత్రాలు ఇస్తే మరిన్ని నిధులు ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు.
ఏ రాష్ట్రానికి కూడా అందించని సాయం కేంద్రం ఎపికి చేస్తోందని పురంధేశ్వరి అన్నారు. రాజధాని వివరమైన నివేదికను కేంద్రానికి ఇవ్వలేదని ఆమె అన్నారు. అన్ని రాష్ట్రాల కన్నా ఎపికే కేంద్రం ఎక్కువ నిధులు ఇస్తోందని ఆమె అన్నారు. పార్టీ జిల్లా మహాసభలో శనివారం ఆమె ప్రసంగించారు.
ఇదిలావుంటే, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ను ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకుంటున్నారని బిజెపి నేత కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. అంబేడ్కర్‌ను నిజంగా గౌరవించిన పార్టీ బీజేపీనే అని అన్నారు. రాష్ట్ర విభజన తర్వాత చట్టంలో ఉన్న అన్ని అంశాలకు కేంద్రం నిధులు కేటాయిస్తూనే ఉందని తెలిపారు. డీపీఆర్లు పంపితే నిధులు ఇచ్చేందుకు కేంద్రం సిద్ధమని కన్నా చెప్పారు.

2019లో అధికారం దక్కించుకోవాలని కన్నా అన్నారు. అధికారమే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని ఆయన పిలువునిచ్చారు. ఎపికి కేంద్రం ఇస్తున్న నిధులు ఎటు వెళ్తున్నాయో కార్యకర్తలు ప్రజలకు తెలియజేయాలని ఆయన అన్నారు. ఏ రాష్ట్రానికీ ఇవ్వని ప్రాముఖ్యం కేంద్రం ఎపికి ఇస్తోందని ఆయన చెప్పారు.
కాగా, సుప్రీంకోర్టు ఇచ్చిన సలహాను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యురాలు రోజా ఇప్పటికైనా పాటిస్తే మంచిదని తెలుగుదేశం నాయకుడు డొక్కా మాణిక్యవరప్రసాద్ సూచించారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. సుప్రీం తీర్పును రోజా తనకిష్టమైన రీతిలో అన్వయించుకోవడం సరికాదని ఆయన హితవు పలికారు.
సేవ్ డెమొక్రసీ పేరుతో వైసీపీ ర్యాలీలు నిర్వహించడం విడ్డూరంగా ఉందని డొక్కా అన్నారు. ఎమ్మెల్యేలపై అనర్హత వేయాలా? వద్దా? అనేది స్పీకర్ నిర్ణయం తీసుకుంటారన్నారు. ఏ పార్టీలో ఉండాలో నిర్ణయించుకునే స్వేచ్ఛ ఎమ్మెల్యేలకుందని డొక్కా వివరించారు.












Click it and Unblock the Notifications