డ్రామాలతో జగన్ ఎన్నాళ్లు నడిపిస్తాడు: పురంధేశ్వరి
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై బిజెపి సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి తీవ్ర వ్యాఖ్యలుచేశారు. డ్రామాలతో జగన్ పార్టీని ఎన్నాళ్లు నడిపిస్తారో చూడాలని ఆమె శనివారంనాడు అన్నారు.
ఎపికి ప్రత్యేకహోదా పేరు లేకపోయినా , అంతకన్నా ఎక్కువ ప్రయోజనాలను రాబడతామని పురందేశ్వరి స్పష్టం చేశారు. యుటిలైజేషన్ సర్టిఫికెట్లు పంపడంలో జాప్యం వల్లే కేంద్రం నుంచి నిధులు త్వరగా రావడం లేదని వివరించారు. తమ పార్టీ ఏపీ ప్రజలకు న్యాయం చేస్తుందని పురందేశ్వరి తెలిపారు.

బంద్‌ను జనం పట్టించుకోలేదు..
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ చేపట్టిన బంద్‌ను జనం పట్టించుకోలేదని ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు వ్యాఖ్యానించారు. హిందూ సంప్రదాయాన్ని దెబ్బతీసేలా జగన్ ప్రవర్తిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఏడు కొండలు కాదు... రెండు కొండలేనని గతంలో వైఎస్ కూడా ఇలాగే చేశారని దుయ్యబట్టారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు పాడిన పాటనే జగన్ పాడుతున్నారని విమర్శించారు. 14వ ఆర్థికసంఘం సిఫార్సులు ఏపీకి నష్టమని చెప్పిందే చంద్రబాబని ఆయన గుర్తు చేశారు. జగన్ జైలుకెళ్లడం ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు పడటం ఖాయమని తేల్చి చెప్పారు. ఎన్డీయే నుంచి టీడీపీ బయటకురావాలని, కేంద్రం నుంచి ఏపీకి నిధులు రావొద్దన్నదే జగన్ కోరిక అని గాలి విమర్శించారు.












Click it and Unblock the Notifications