టీడీపీలోకి రఘురామ, సీటు ఖరారు - పదవిపై చంద్రబాబు హామీ..!!
ఏపీలో ఎన్నికలవేళ కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. వైసిపి రెబల్ ఎంపీ రఘురామకు బిజెపి టికెట్ నిరాకరించింది. అనేక తర్జన భర్జనల తరువాత రఘురామ టీడీపీలో చేరటం ఖాయమైంది. తాజాగా ఆయన చంద్రబాబుతో భేటీ అయ్యారు. బీజేపీతో నర్సాపురం సీటు కోసం ప్రయత్నాలు చేసినా, ఫలించలేదు. ఫలితంగా రఘురామను టీడీపీ నుంచి అసెంబ్లీ సీటు ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారు. అధికారంలోకి వస్తే ఇచ్చే పదవి పైన హామీ ఇచ్చారు.
అసెంబ్లీ బరిలో రఘురామ
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ ఎన్నికల్లో పోటీ చేయటం ఖాయమైంది. తొలి నుంచి ఆయన తన సిట్టింగ్ స్థానం నర్సాపురం పైనే ఆశలు పెట్టుకున్నారు. కూటమిలో తనకు తన సీటు ఇస్తారని ఆశించారు. కానీ, ఆ సీటు బీజేపీకి వెళ్లటంతో అక్కడ నుంచి పార్టీ సీనియర్ నేత శ్రీనివాస వర్మకు కేటాయించారు. ఆ తరువాత రఘురామ తనకు సీటు ఇప్పించాల్సిన బాధ్యత చంద్రబాబుపైనే ఉందని చెప్పుకొచ్చారు. దీంతో, టీడీపీ అధినేత చంద్రబాబు బీజేపీ ముఖ్య నేతలతో పలుమార్లు చర్చలు చేసారు. నర్సాపురం సీటు రఘురామకు ఇస్తే...ప్రత్యామ్నాయంగా మరో సీటు బీజేపీకి ఇచ్చేందుకు ప్రతిపాదించారు. నర్సాపురంలో తమ అభ్యర్ది ని మార్చేందుకు బీజేపీ అంగీకరించలేదు. ఫలితంగా తాజాగా చంద్రబాబుతో రఘురామ భేటీ అయ్యారు.

చంద్రబాబు నిర్ణయంతో
ఈ ఇద్దరి భేటీ సమయంలో చంద్రబాబు తన నిర్ణయం వెల్లడించారు. రేపు (శుక్రవారం) రఘురామ పాలకొల్లులో చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరుతారు. రఘురామకు ఉండి నుంచి అసెంబ్లీకి పోటీ చేయించాలని చంద్రబాబు నిర్ణయించారు. తొలుత తాను పార్లమెంట్ కే పోటీ చేస్తానని రఘురామ చెప్పినా..తాజా పరిస్థితుల్లో చంద్రబాబు సూచన మేరకు ఉండి నుంచి పోటీకి సిద్దమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఉండి నుంచి టీడీపీ తమ అభ్యర్దిని ప్రకటించింది. తాజా సమీకరణాల్లో భాగంగా అక్కడ అభ్యర్దిగా ప్రకటించిన రామారాజుకు కూటమి అధికారంలోకి వస్తే ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రోజు భీమవరం రానున్న రఘురామ తన రాజకీయం పైన అధికారికంగా ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది.
భవిష్యత్ పదవి పై హామీ
జగన్ పైన విరుచుకుపడే రఘురామకు సీటు ఇవ్వటం ద్వారా కలిసి వస్తుందని చంద్రబాబు అంచనా వేస్తున్నారు. అయితే, బీజేపీ ఎంపీ సీటు ఇవ్వకపోవటంతో రఘురామ సైతం అసెంబ్లీకి పోటీ చేసేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. నర్సాపురం పరిధిలోనే రఘురామ పోటీ చేయటం ద్వారా ఓట్ల పరంగానూ కలిసి వస్తుందని లెక్కలు వేస్తున్నారు. అదే సమయంలో కూటమి అధికారంలోకి వస్తే రఘురామకు కీలక పదవి ఇస్తామని చంద్రబాబు చెప్పినట్లుగా సమాచారం. ఉండి నుంచి వైసీపీ అభ్యర్దిగా పీవీఎల్ నర్సింహ రాజు పోటీ చేస్తున్నారు. ఇప్పుడు అక్కడ టీడీపీ అభ్యర్దిగా రఘురామ రోజు పోటీ చేయటం ఖాయమైతే వైసీపీ ఇదే అభ్యర్దిని కొనసాగిస్తుందా..మార్పు చేస్తుందా..అసలు రఘురామ పోటీ పైన అధికారికంగా ఎలాంటి నిర్ణయం వస్తుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications