టీవీ9 కూడా ఇలాంటి ప్రచారామా?: ‘తెలంగాణలో అన్యాయమైతే ఇక్కడ కాదా?’
కడప: పలువురు ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో చేరిన నేపథ్యంలో కడప జిల్లాకు చెందిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మైదుకూరు ఎమ్మెల్యే రఘురామి రెడ్డి స్పందించారు. ఎవరెన్ని ప్రచారాలు చేసినా తాను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడేది లేదని రఘురామిరెడ్డి స్పష్టం చేశారు.
గురువారం కడప జిల్లాలో పర్యటిస్తున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని రఘురామిరెడ్డి ప్రొద్దుటూరులో కలిశారు. అనంతరం రఘురామిరెడ్డి మాట్లాడుతూ.. వైయస్ జగన్ వెంటే తన పయనమని స్పష్టం చేశారు. పార్టీలు మారడం అనైతికమని అన్నారు.
తమ పార్టీ ఎమ్మెల్యేలు మరో పార్టీలో చేరుతున్నట్లు వార్తా ఛానళ్లు ఇష్టం వచ్చినట్లు ప్రసారం చేస్తున్నాయని మండిపడ్డారు. టీవీ9 అంటే తనకు గౌరవం ఉందని, కానీ వాళ్లు కూడా అవాస్తవాలు చెబుతున్నారని విమర్శించారు. పార్టీ మారే అవకాశం లేని మాలాంటి వాళ్ల మీద ఇలాంటి ప్రచారమా? అని ప్రశ్నించారు.

ఓ పార్టీ గుర్తుతో గెలిచిన ఎమ్మెల్యేలను వేరే పార్టీ వాళ్లు పిలవడమే పెద్ద తప్పని రఘురామిరెడ్డి చెప్పారు. ఒకవేళ ఎమ్మెల్యేలు మరోపార్టీలో చేరితే.. నియోజకవర్గాల్లో ఎలా తిరుగుతారని నిలదీశారు. పార్టీ మారిన వాళ్లు... నియోజకవర్గాల్లో తిరిగే పరిస్థితి లేదన్నారు.
పార్టీ ఫిరాయింపులు ప్రజాస్వామ్యనికి విరుద్ధమని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలంగాణలో ఓ న్యాయం.. ఏపీలో మరో న్యాయమా? అని నిలదీశారు.
తెలంగాణలో పార్టీ మారితే వ్యతిరేకిస్తారు? ఇక్కడ ఎలా సమర్థిస్తారు? అని ప్రశ్నించారు. చంద్రబాబుకు నైతిక విలువలు లేవని అన్నారు. విలువలు లేని చంద్రబాబు.. ఎథిక్స్ పెట్టడం హాస్యాస్పదంగా ఉందని రఘురామిరెడ్డి ఎద్దేవా చేశారు.












Click it and Unblock the Notifications