‘సూట్ కేసుతో చినబాబు.. బ్రీఫ్ కేసుతో పెదబాబు’
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి తీవ్రంగా దుయ్యబట్టారు. చంద్రబాబు నాయుడి ఏడాది పాలన తర్వాత 'నోటు కొట్టు - సీటు పట్టు' అంటూ ప్రజలకు అద్భుతమైన కానుకిచ్చారని మండిపడ్డారు.
ఆయన సోమవారం పార్టీ నేతలతో కలిసి మీడియాతో మాట్లాడుతూ.. సూట్ కేసుతో చిన్న బాబు నారా లోకేష్, బ్రీఫ్ కేసుతో పెద్ద బాబు చంద్రబాబు నేతలను లోబర్చుకునేందుకు తిరుగుతున్నారని ఆరోపించారు. ఈ అవమానాలను ఏపీ ప్రజలందరూ భరించాలా? అని ప్రశ్నించారు.
బాబు తక్షణం అన్ని ఆరోపణలపై ప్రజలకు సమాధానం చెప్పాలని రఘువీరా డిమాండ్ చేశారు. గతంలో ఇటువంటి వివాదాలతో ప్రభుత్వాలే కూలిపోయాయని, ఇప్పుడు అదే పరిస్థితి తలెత్తిందని పేర్కొన్నారు. ఆ తర్వాత టీడీపీ మేనిఫెస్టో ప్రతులను రఘువీరారెడ్డి, ఇతర కాంగ్రెస్ నేతలు చింపేసి చెత్తబుట్టలో పడేశారు.

హామీలు నెరవేర్చడంలో టీడీపీ ప్రభుత్వం విఫలమైందని ఆయన ఆరోపించారు. చంద్రబాబు ఏడాది పాలనలో కూలీల ఎన్‌కౌంటర్... ఫ్యాక్షన్ హత్యలు, విదేశీ పర్యటనలు తప్ప ఏమీ లేదన్నారు. పేదల ఇళ్లకు నిధులివ్వకుండా తన సొంతింటికి నిధులు కేటాయించుకున్నారని ఆయన ఆరోపించారు.
ఆడియో టేపుల వ్యవహారంలో బాబు ఇంతవరకు స్పందించలేదని, అసలాయన తప్పు చెయ్యకుంటే ఎందుకు నోరు విప్పరని విమర్శించారు. అడ్డదిడ్డంగా పాలన కొనసాగిస్తూ, కాంగ్రెస్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు మంగళం పాడారని, నేతలంతా తలదించుకునే పరిస్థితిని బాబు తెచ్చారని దుయ్యబట్టారు. రోజుకు పది కోట్ల చొప్పున చంద్రబాబు తన ఏడాది పాలనలో 3వేల 650 కోట్లు సంపాదించారని ఆరోపించారు.












Click it and Unblock the Notifications