సింప్లిసిటీతో అదరగొట్టారా?: కేసీఆర్ పైన ఆరా తీసిన రాహుల్ గాంధీ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైలన పైన ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ ఆరా తీశారని సమాచారం. తెలంగాణలో కేసీఆర్ ఏడాది పాలన పట్ల ప్రజలు ఏమనుకుంటున్నారు? సానుకూల, వ్యతిరేక విధానాలు ఏమిటని రాహుల్ ఆరా తీశారు.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కార్యాధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్కలను అదిలాబాదులో ఉండగా రాహుల్ గాంధీ ఆరా తీశారని తెలుస్తోంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల అంశాన్ని ప్రస్తావించారు.
తన పాదయాత్ర జరిగిన తీరు, ప్రజా సంప్దన పైన సమగ్ర నివేదిక ఇవ్వాలని రాహుల్ గాంధీ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నేతలను ఆదేశించారు. అదిలాబాద్ జిల్లా పాదయాత్రలో రాహుల్ తన సింప్లిసిటీతో, ప్రజలతో పాటు పార్టీ శ్రేణులను ఆకట్టుకున్నారు.

కాగా, రాహుల్ గాంధీ ఆదిలాబాద్ జిల్లా పర్యటన తెలంగాణ ప్రభుత్వానికి చిక్కులు తెచ్చిపెట్టినట్లే కనిపిస్తోంది. రాహుల్ గాంధీ పర్యటన వల్ల తెలంగాణలోని రైతుల ఆత్మహత్య సమస్య జాతీయ స్తాయిలో చర్చనీయాంశంగా మారింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం నష్ట నివారణ చర్యలకు దిగినట్లు కనిపిస్తోంది.
ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలను రాహుల్ శుక్రవారంనాడు పరామర్శించడంతో పాటు సాయంత్రం జరిగిన బహిరంగ సభలో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును కూడా లక్ష్యం చేసుకుని వ్యంగ్యాస్త్రాలు విసిరారు.
రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఆత్మహత్యలు చేసుకున్న రైతుల జాబితాను తయారు చేసి, వారి కుటుంబాలకు ఆర్థిక సాయం అందించే చర్యలకు శ్రీకారం చుట్టింది. జూన్‌లో తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో వేయిమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని కాంగ్రెసు నాయకులు ఆరోపిస్తున్నారు.












Click it and Unblock the Notifications