ఇడుపులపాయ వైఎస్సార్ ఘాట్ వద్ద రాహుల్ గాంధీ చిరునవ్వులు
YS Jagan: ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్ గడువు దగ్గర పడింది. ఇంకొక్క రోజే మిగిలివుంది. సోమవారం రాష్ట్రంలో గల 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ నియోజకవర్గాలకు ఓటింగ్ జరుగనుంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ప్రభుత్వాన్ని ఎన్నుకోనున్నారు.
ఈ సాయంత్రానికి ఎన్నికల ప్రచారానికి తెరపడుతుంది. సాయంత్రం 6 గంటలకు ఎన్నికల ప్రచారం ముగుస్తుంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు కూడా తమ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, టీడీపీ చీఫ్, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు రోడ్ షోల్లో పాల్గొంటోన్నారు.

అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ సైతం ఎన్నికల ప్రచారంలో దూకుడుగా వ్యవహరిస్తోంది. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కడప జిల్లాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ పాల్గొనబోతోన్నారు. ఏపీసీసీ అధినేత్రి వైఎస్ షర్మిల, కేవీపీ రామచంద్రరావు, ఎన్ రఘువీరారెడ్డి, తులసీరెడ్డి, శైలజానాథ్.. వంటి సీనియర్ నాయకులు ఇందులో పాల్గొననున్నారు.
ఇందులో పాల్గొనడానికి రాహుల్ గాంధీ కొద్ది సేపటి కిందటే కడపకు చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో ఇడుపులపాయకు చేరుకున్నారు. వైఎస్సార్ ఘాట్‌ను సందర్శించారు. సమాధి వద్ద మౌనం పాటించారు. దివంగత ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి నివాళి అర్పించారు. అక్కడే ఉన్న వైఎస్సార్ విగ్రహానికి పూల మాల వేశారు.
ఆ సమయంలో రాహుల్ గాంధీ వెంట.. వైఎస్ షర్మిల, కేవీపీ రామచంద్రరావు, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉన్నారు. అనంతరం ఇడుపులపాయలో గల గెస్ట్ హౌస్‌లో విశ్రాంతి తీసుకుంటారు. భోజన విరామం అనంతరం బహిరంగ సభకు బయలుదేరి వెళ్తారు రాహుల గాంధీ.
కాంగ్రెస్ జాతీయ స్థాయి నాయకులు వైఎస్సార్ ఘాట్‌ను సందర్శించడం ఇదే తొలిసారి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అటు గాంధీ కుటుంబం నుంచి కూడా ఇప్పటివరకు ఒక్కరు కూడా వైఎస్సార్ ఘాట్‌కు వచ్చిన సందర్భాలు లేవు. ఎన్నికల నేపథ్యంలో రాహుల్ గాంధీ ఇక్కడికి రావడం చర్చనీయాంశమైంది.












Click it and Unblock the Notifications