ఏపీలో థియేటర్లపై సర్కార్ కొరడా-రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు-తేడా కనిపిస్తే సీజ్-కృష్ణాలో 15 మూసివేత
ఏపీలో సినిమా థియేటర్లపై పోలీసులు, రెవెన్యూ అధికారులు విరుచుకుపడుతున్నారు. కొత్తగా అమల్లోకి వచ్చిన చట్టాన్ని ప్రయోగిస్తున్నారు. థియేటర్లపై రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు చేపడుతున్నారు. ఎక్కడైనా ఉల్లంఘించినట్లు తేలితే థియేటర్లను మూసేస్తున్నారు. ఎక్కడికక్కడ నోటీసులు జారీ చేయడంతో పాటు లైసెన్స్, ఉల్లంఘనపై పూర్తిగా నిఘా పెట్టారు. క్యాంటీన్లను కూడా వదిలిపెట్టడం లేదు. దీంతో థియేటర్ల యాజమాన్యాలు బెంబేలెత్తుతున్నాయి.

థియేటర్లపై కొరడా
ఏపీలో కరోనా దెబ్బ నుంచి కోలుకుని ఇప్పుడిప్పుడే కొత్త సినిమాలు థియేటర్లలో విడుదలవుతున్నాయి. బాలయ్య అఖండ, అల్లు అర్జున్ పుష్ప రూపంలో రెండు పెద్ద సినిమాలు విడుదలయ్యాయి. వీటిని చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టారు. అదే సమయంలో అధికారులు, పోలీసులు కూడా థియేటర్లకు చేరుకుంటున్నారు. ఎక్కడికక్కడ తనిఖీలు చేపడుతున్నారు. థియేటర్లలో టికెట్లు, క్యాంటీన్, సౌకర్యాలు వంటి వాటిపై ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తున్నారు. ఇందులో ఎక్కడ ఏ తేడా కనిపించినా విరుచుకుపడుతున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా థియేటర్ల తనిఖీ
రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు అధికారులు, పోలీసులు రంగంలోకి దిగారు. నిన్నటి నుంచి థియేటర్లలో వరుసగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రతీ చోటా థియేటర్ కు వెళ్లడం, ఏదో ఒక షో సమయంలో పోలీసుల్ని తీసుకుని వెళ్లడం, అక్కడ యాజమాన్యం లేదా సిబ్బంది ఎవరు కనిపించినా సౌకర్యాలపై ఆరా తీయడం, ఆ తర్వాత సినిమా చూస్తున్న ప్రేక్షకుల్ని కలిసి వాటిపై ప్రశ్నలు వేయడం, ఇబ్బందులు ఏమైనా ఉన్నాయేమో తెలుసుకోవడం, ఎక్కడ ఏ తేడా కనిపించినా చర్యలకు దిగడం వంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి.

కృష్ణాజిల్లాలోనే 15 థియేటర్ల సీజ్
రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల థియేటర్లపై తనిఖీలు చేపట్టిన అధికారులు, పోలీసులు.. నిబంధనలు ఉల్లంఘించారని తేలితే మాత్రం సీజ్ లు చేసేస్తున్నారు. ఒక్క కృష్ణాజిల్లాలోనే తనిఖీలు నిర్వహించి 15 థియేటర్లు సీజ్ చేసినట్లు జేసీ మాధవీలత కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. ఇందులో లైసెన్స్ లు లేకపోవడం, ఆన్ లైన్ టికెట్లు అమ్మకపోవడం, ఇతరత్రా ఉల్లంఘనల్ని అధికారులు కారణంగా చూపుతున్నారు. ముఖ్యంగా ప్రేక్షకులు చేస్తున్న ఫిర్యాదుల్ని సీరియస్ గా తీసుకుని థియేటర్ల సీజ్ చేపడుతున్నట్లు తెలుస్తోంది.

థియేటర్ల బెంబేలు
ఏపీలో ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు, పోలీసులు వరుసగా చేపడుతున్న తనిఖీలతో థియేటర్లు బెంబేలెత్తుతున్నాయి. ముఖ్యంగా కరోనా తర్వాత ఇప్పుడిప్పుడే థియేటర్లు తెరిచి సినిమాలు వేసేందుకు ముందుకొస్తున్న యాజమాన్యాలను తనిఖీల పేరుతో అధికారులు వేధించడం, థియేటర్లు సీజ్ చేయడంపై డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు, టాలీవుడ్ పెద్దలు మండిపడుతున్నారు. ప్రేక్షకుల నుంచి ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకోవడంలో తప్పు లేదని, కానీ అధికారులే థియేటర్లకు వెళ్లి ప్రేక్షకులకు ప్రశ్నలు వేసి చర్యలకు దిగడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
Recommended Video

సంక్రాంతి సినిమాలకు చుక్కలే
సంక్రాంతి రాకముందే ప్రభుత్వం తనిఖీల పేరుతో థియేటర్లను బెంబేలెత్తిస్తుంటే .. ఇక సంక్రాంతి సీజన్ లో సినిమాల పరిస్దితి ఏంటనే ఆంధోలన మొదలైంది. ముఖ్యంగా సంక్రాంతికి పెద్ద సినిమాలుగా భావిస్తున్న ఆర్ఆర్ఆర్, రాథేశ్యామ్ వంటి సినిమాలు విడుదల చేసేందుకు నిర్మాతలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వం ఇలా తనిఖీలు, సీజ్ లతో థియేటర్లను ఇబ్బందిపెడితే ఇక తమ సినిమాల విడుదల ఎలా అని డిస్ట్రిబ్యూటర్లు కూడా ఆందోళన చెందుతున్నారు. త్వరలో ప్రభుత్వంతో దీనిపై చర్చిస్తామని వారు చెప్తున్నారు.












Click it and Unblock the Notifications