తెలుగు రాష్ట్రాలకు తొలి వందేభారత్ స్లీపర్ - రూట్ ఫిక్స్..!!
తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో నాలుగు వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి. ప్రయాణీకుల ఆదరణ ఉండటంతో..ఇప్పుడు మరో కొత్త రైలును తెలుగు రాష్ట్రాలకు కేటాయిస్తూ రైల్వే శాఖ నిర్ణయించింది. త్వరలో అందుబాటులోకి రానున్న వందేభారత్ స్లీపర్ ను ఏపీ నుంచి ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ మేరకు రూట్ ఫిక్స్ చేసారు. త్వరలోనే ఈ రైలును అధికారికంగా ప్రారంభిచేందుకు కసరత్తు జరుగుతోంది.
వందేభారత్ స్లీపర్ సిద్దం:తెలుగు రాష్ట్రాలకు స్లీపర్ కోచ్‌లతో నడిచే వందేభారత్ రైలు రానుంది. దీనిని నరసాపురం నుంచి బెంగళూరుకు నడపనున్నారు. ఈ విషయాన్ని విజయవాడ డీఆర్‌ఎం నరేంద్రపాటిల్ వెల్లడించారు. వందే భారత్ స్లీపర్ కోచ్‌లు పట్టాలెక్కగానే నరసాపురం నుంచి బెంగళూరుకు నడిపే ప్రతిపాదన పరిశీలనలో ఉందన్నారు. ఈ రైలు 10గంటల్లో బెంగళూరు చేరుకుంటుందన్నారు. దీనిని వయా గుంటూరు లేదా వయా ఒంగోలు నడపాలా ఇంకా నిర్ణయించలేదన్నారు. నరసాపురం నుంచి గుంటూరు పాస్ట్ ప్యాసింజర్‌ను పునరుద్దరిస్తామన్నారు. గతంలో మాదిరిగా నడిచినట్లే నరసాపురం నుంచి విశాఖకు రిజర్వేషన్ కోచ్‌లతో ఉన్న లింకు ఎక్స్‌ప్రెస్‌ను రాత్రి సమయంలో నడిపే ప్రతిపాదన ఉందన్నారు.

నర్సాపూర్ - బెంగళూరు మధ్య:వారానికో సారి నడుస్తున్న బెంగళూరు స్పెషల్ రైళ్లను రెగ్యులర్ చేసే యోచన ఉందన్నారు. అమరావతి ఎక్స్‌ప్రెస్‌ను నరసాపురం వరకు పొడిగించేందుకు ఆమోదం వచ్చిందన్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో విశాఖ -సికింద్రాబాద్, విజయవాడ - చెన్నై, కాచిగూడ- యశ్వంత్ పూర్, సికింద్రాబాద్ - తిరుపతి వందేభారత్ రైళ్లు కొనసాగుతున్నాయి. ఈ నాలుగు రైళ్లకు మంచి ఆదరణ కొనసాగుతోంది.
ఈ సమయంలోనే మరో రెండు వందేభారత్ స్లీపర్ రైళ్లు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రారంభిందుకు ప్రణాళికలు సిద్దమవుతున్నాయి. అందులో సికింద్రాబాద్ - పూణే, నర్సాపూర్ - బెంగళూరు ఉన్నాయి. వీటిల్లో ముందుగా నర్సాపూర్ - బెంగళూరు వందేభారత్ స్లీపర్ పట్టాలెక్కించేందుకు అధికారులు సిద్దమవుతున్నారు.
సరికొత్త ఫీచర్లతో డిజైన్:వందేభారత్ స్లీపర్ కోచ్ లు ప్రయాణీకులకు అధునిక ఫీచర్లతో సిద్దం చేస్తున్నారు. ప్రతి రైలులో 857 బెర్త్‌లు ఉంటాయి.. వీటిలో 823 ప్రయాణికుల కోసం కాగా, 37 బెర్త్‌లను సిబ్బందికి కేటాయించేలా నిర్ణయించారు. ప్రతి కోచ్‌లో నాలుగు కాకుండా మూడు టాయ్‌లెట్లు ఉంటాయి. ఒక మినీ ప్యాంట్రీ.. వందేభారత్ స్లీపర్ కోచ్‌లలో దివ్యాంగులకు అనువుగా ఉండేందుకు ర్యాంప్‌లను ఏర్పాటు చేయనున్నారు.
పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ కోచ్‌లలో బెర్త్‌లు మరింత వెడల్పుగా ఉండనున్నాయి. ప్రయాణికులు సులభంగా పై బెర్తుకు చేరుకునేందుకు వీలుగా వీటిని డిజైన్ చేశారు. వచ్చే సంక్రాంతికి నర్సాపూర్ - బెంగళూరు వందేభారత్ స్లీపర్ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications