వందే భారత్ పై రాళ్ల దాడులు- 102 మందిని అరెస్టు చేసిన రైల్వే...!
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఈ మధ్య వందే భారత్ సహా పలు రైళ్లపై రాళ్లు విసరడం, ట్రాక్ లపై రాళ్లు, ఇతర ప్రమాద కర వస్తువులు ఉంచుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. వీటి వల్ల రైలు ప్రమాదాలు జరగడం, రైల్వే ఆస్తులకు నష్టం వాటిల్లడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన రైల్వే రక్షణ దళం తాజాగా తనిఖీలు నిర్వహించింది. ఇందులో భారీగా నిందితుల్ని అరెస్టు చేసింది.
రైళ్లపై రాళ్ల దాడికి పాల్పడే , రైల్వే ట్రాక్‌లపై ప్రమాదకారక వస్తువులు ఉంచే ఆకతాయిలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్పీఎఫ్ హెచ్చరించింది. రైళ్లపై రాళ్ల దాడికి పాల్పడిన 102 మందిని అరెస్ట్ చేసిన రైల్వే రక్షక దళం..పట్టాలపై ప్రమాదకర వస్తువులు ఉంచినందుకుగాను 33 మంది నేరస్థుల్ని అరెస్టు చేసింది. రైళ్లపై రాళ్లు రువ్వడం, రైల్వే ట్రాక్‌లపై ప్రమాదకారక వస్తువులను ఉంచడం వంటి దుశ్చర్యలకు పాల్పడవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. దీనివల్ల ప్రయాణికుల భద్రతకు భంగం కలుగుతుందని, రైల్వే ఆస్తులకు నష్టం వాటిల్లుతుందని తెలిపింది.

ఇటువంటి కార్యకలాపాలు క్రిమినల్ నేరం, నేరస్థులపై రైల్వే చట్టంలోని సెక్షన్ 153 కింద కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇలాంటి నేరాలకు గరిష్టంగా 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధిస్తామని తెలిపింది. భవిష్యత్తులో ఇటువంటి సంఘ వ్యతిరేక సంఘటనలను నివారించడానికి, దక్షిణ మధ్య రైల్వే వ్యాప్తంగా చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది జనవరి నుండి మే వరకు రైళ్ల పై దాడులు చేసిన 128 కేసులు నమోదు చేసినట్లు తెలిపింది. వీటిలో 85 కేసుల్లో 102 మంది నేరస్తుల్ని అరెస్టు చేసారు. ఈ కేసులపై రైల్వే కోర్టులో విచారణ చేసినట్లు తెలిపింది.

ఇందులో ఇప్పటివరకు 12 మందిని దోషులుగా నిర్ధారించగా , అందులో ఒక నిందితుడికి 15 రోజుల జైలు శిక్ష, మిగిలిన 11 మంది నిందితులకు రూ.30,500 జరిమానా విధించారు. రైల్వే పట్టాలపై ప్రమాదకారక వస్తువులను ఉంచిన 29 కేసులు నమోదుచేయగా, వీటిలో 26 కేసుల్లో 33 మంది నేరస్థులను గుర్తించి అరెస్టు చేశారు. వీటిపై విచారణ జరుగుతోంది. ఇలాంటి చర్యలను ఎదుర్కోవడంలో రైల్వేకు సహకరించాలని జీఎం కోరారు.
ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తుల గురించి 139కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని, తద్వారా త్వరితగతిన చర్యలు తీసుకోవచ్చన్నారు. ఇలాంటి చర్యలు ప్రయాణీకుల భద్రత, విలువైన జాతీయ వనరులను కోల్పోవడంతో పాటు వారి భవిష్యత్తుపై శాశ్వత ప్రభావాన్ని చూపే ప్రతికూల పరిణామాల గురించి పిల్లలకు అవగాహన కల్పించాలని ఆయన తల్లిదండ్రులకు కూడా విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications