ఒక ఐడియా... జీవితాన్ని కాదు, రైల్వేనే మార్చేసింది
ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది. అలాగే భారతీయ రైల్వే తీసుకున్న ఒక నిర్ణయం లాభాల పట్టాలపై దూసుకెళ్లాలా చేసింది. అంతేనా.. భారీగా రూ.2800 కోట్ల లాభాలను ఆర్జించి పెట్టింది. రైలులో ప్రయాణించే చిన్నారుల టికెట్ విషయంలో సంస్థ తీసుకున్న నిర్ణయం భారీ లాభాలను కట్టబెట్టింది. ఈ విషయాన్ని రైల్వేనే స్వయంగా వెల్లడించింది.
సమాచార హక్కు చట్టంద్వారా: ఏడు సంవత్సరాల్లో రూ.2800 కోట్ల ఆదాయం రాగా 2022-23 ఆర్థిక సంవత్సరంలోనే అత్యధిక ఆదాయం వచ్చింది. సమాచార హక్కు చట్టంద్వారా దరఖాస్తు చేసుకున్న వ్యక్తికి సమాధానం ఇచ్చే క్రమంలో ఈ విషయాన్ని వెల్లడించింది. చిన్నపిల్లలకు ఫుల్ టికెట్ తీసుకోవడం లాభాసాటిగా మారిందని తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలోనే రూ.560 కోట్లు వచ్చాయి.

ఫుల్ టికెట్ కొనాల్సిందే : చిన్నపిల్లలకు ఫుల్ టికెట్ తీసుకోవాలనే నిబంధన అమల్లోకి రాకముందు 5 నుంచి 12 సంవత్సరాల్లోపు చిన్నారులకు బెర్త్ కేటాయించినా సగం ధరే తీసుకునేవారు. దీన్ని సవరించి 2016 ఏప్రిల్ 21వ తేదీన కొత్త నిబంధన అమల్లోకి తెచ్చింది. పిల్లలకు ప్రత్యేకంగా బెర్త్ కావాలంటే పెద్దవారిలా టికెట్ తీసుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. బెర్త్ వద్దనుకుంటే సగం ధర చెల్లిస్తే సరిపోతుంది.
10 కోట్ల మంది ప్రయాణించారు: ఈ నేపథ్యంలో 2016-17 నుంచి 2022-23 వరకు వేర్వేరు ఆర్థిక సంవత్సరాల్లో రైల్వే శాఖకు ఎంత మొత్తం ఆదాయం సమకూరింది అని సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు దాఖలైంది. దీనికి రైల్వే శాఖ సమాధానం ఇచ్చింది. ఈ ఏడేళ్లలో ఫుల్ టికెట్ డబ్బులు చెల్లించి 10 కోట్ల మంది చిన్న పిల్లలు ప్రయాణించినట్లు తెలిపింది. 6 కోట్ల మంది చిన్న పిల్లలు మాత్రమే హాఫ్ టికెట్ చెల్లించారని, రైళ్లల్లో ప్రయాణించే చిన్నారుల్లో దాదాపు 70 శాతం మంది ఫుల్ టికెట్ చెల్లించే ప్రయాణిస్తున్నారని వెల్లడైంది.












Click it and Unblock the Notifications