రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక
వేసవి సెలవుల్లో ప్రయాణికుల అదనపు రద్దీని నివారించడానికి రైల్వే అధికారులు పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడిపించనున్నారు. చర్లపల్లి, తిరుపతి నుంచి ఈ ప్రత్యేక సర్వీసులు వివిధ ప్రధాన గమ్యస్థానాల మధ్య అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు వీటిల్లో మెజారిటీ రైళ్లు రెగ్యులర్ సర్వీసులుగా మారడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రయాణికుల నుండి అపూర్వ ఆదరణ అందుతున్న నేపథ్యంలో వీటిని రైల్వే అధికారులు ప్రత్యేక రైళ్ల నుండి రెగ్యులర్ ట్రైన్లుగా మార్పు చేశారు.
అదే సమయంలో రాజమండ్రి- కాకినాడ మధ్య రాకపోకలు సాగిస్తోన్న ప్రత్యేక రైలు కూడా రెగ్యులర్ హోదాను పొందింది. ఈ సర్వీస్ ను క్రమబద్దీకరించింది. ఈ విషయాన్ని భారతీయ జనతా పార్టీకి చెందిన రాజమండ్రి లోక్ సభ సభ్యురాలు పురందేశ్వరి వెల్లడించారు. గతంలో తాను చేసిన విజ్ఞప్తికి, అందజేసిన వినతిపత్రాలకు రైల్వే మంత్రిత్వ శాఖ సానుకూలంగా స్పందించిందని అన్నారు.

దీంతో రాజమండ్రి- కాకినాడ పోర్ట్ ప్రత్యేక రైలు ఇకపై రోజువారీ రైలు సర్వీస్ గా ప్రయాణికులకు సేవలు అందిస్తుందని తెలిపారు. 07523/07524 రాజమండ్రి కాకినాడ పోర్ట్ స్పెషల్ ట్రైన్ ఇకపై రోజువారీ అందుబాటులో ఉంటుంది. దీని నంబర్ కూడా మారింది. 67301/67302 రాజమండ్రి- కాకినాడ పోర్ట్- రాజమండ్రి మెము ఎక్స్‌ప్రెస్ గా మారింది.
ప్రతి రోజూ తెల్లవారు జామున 6: 15 నిమిషాలకు కాకినాడ పోర్ట్ నుండి బయలుదేరే నంబర్ 67301 మెము ఎక్స్ ప్రెస్ ఉదయం 8: 15 నిమిషాలకు రాజమండ్రికి చేరుకుంటుంది. రాజమండ్రి నుండి మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరే నంబర్ 67302 మెము ఎక్స్ ప్రెస్ సాయంత్రం 4: 40 నిమిషాలకు కాకినాడ పోర్ట్ కు చేరుకుంటుంది. కాకినాడ టౌన్, సామర్లకోట, మేడపాడు, బిక్కవోలు, అనపర్తి, ద్వారపూడి మీదుగా ఈ రైలు రాకపోకలు సాగిస్తుంది.
ఈ నిర్ణయం ద్వారా రాజమండ్రి - కాకినాడ రోజువారీ ప్రయాణికులకు మరింత సౌకర్యం కలిగించినట్టయిందని, తక్కువ ఛార్జీతో కూడిన ప్రయాణం అందించామని పురందేశ్వరి తెలిపారు.












Click it and Unblock the Notifications