రోడ్డు ప్రమాదం: లొంగిపోయిన లారీ డ్రైవర్, మృతులు వీరే
రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ జోగి శ్రీను సోమవారం ఉదయం పోలీసులకు లొంగిపోయాడు. రాజమండ్రి గండేపల్లి వద్ద లారీ బోల్తా పడడంతో 18 మంది మరణించిన విషయం తెలిసిందే. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్, క్లీనర్ పారిపోయారు.
అయితే, ఆ తర్వాత లారీ డ్రైవర్ పోలీసులకు విశాఖపట్నం జిల్లా నక్కపల్లి పోలీసులకు లొంగిపోయాడు. డ్రైవర్ స్వస్థలం విశాఖపట్నం జిల్లా ఎస్ రాయవరం మండలం కొత్తపోలవరం. రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష జరిపారు. రవాణా శాఖ మంత్రి శిద్ధా రాఘవరావు, రవాణా శాఖ అధికారులతో ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి వద్ద జరిగిన లారీ ప్రమాద ఘటనపై రాష్ట్ర రవాణాశాఖ కమిషనర్ సుబ్రమణ్యంతో విచారణ జరిపిస్తామని డిప్యూటీ సీఎం చినరాజప్ప వెల్లడించారు. బాధిత కుటుంబాలు, క్షతగాత్రులను పరామర్శించిన చినరాజప్ప మీడియాతో మాట్లాడారు.

మృతుల కుటుంబాలకు రెండు లక్షల రూపాయల నష్టపరిహారంతోపాటు ఇళ్లస్థలాలు ఇస్తామని ప్రకటించారు. క్షతగాత్రులకు ఉచితంగా మెరుగైన వైద్యం అందించడంతోపాటు 25వేలరూపాయల చొప్పున ఆర్థికసాయం అందిస్తామన్నారు. లారీలో కూలీలను ఎక్కించినా పోలీసులు, రవాణశాఖాధికారులు పట్టించుకోకుండా ఉండటంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై విచారణ నివేదిక వచ్చాక చర్యలు తీసుకుంటామన్నారు.
మృతులు వీరే
దర్ల సూరిబాబు, వెంకన్న, నాగబాబు, రాంబాబు, బాబ్జీ, గాబు త్రీనాథ్, గాదె దొరబాబు, కొండబాబు, త్రిమూర్తులు, శివకృష్ణ, వెలుగుల సూరిబాబు, గొల్లపల్లి దొరబాబు, సత్యనారాయణ, వీరబాబు, సురేష్












Click it and Unblock the Notifications