టీడీపీని అక్కడ జగన్ "జీరో" చేస్తారా, ఢిల్లీ స్కెచ్ - చంద్రబాబు రివర్స్ గేమ్..!!
ఏపీలో ఎన్నికల పోరు ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. ప్రధాన పార్టీలు కొత్త వ్యూహాలతో సిద్దం అవుతున్నాయి. ఎన్నికల వేళ కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు ముందే కీలక పోరు జరగనుంది. చంద్రబాబుకు పెద్దల సభలో అసలు ప్రాతినిధ్యం లేకుండా చేసే అరుదైన అవకాశం జనగ్ చేతికి అందుతోంది. దీనిని కౌంటర్ చేసేందుకు చంద్రబాబు కొత్త వ్యూహాలు సిద్దం చేస్తున్నారు. దీంతో, ఢిల్లీ కేంద్రంగా ఏం జరుగుతుందనే ఉత్కంఠ మొదలైంది.
ఏపీలో రాజ్యసభ సీట్ల కోసం: ఏపీలో అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే మరో ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నిక జగన్, చంద్రబాబు సమర్ధతకు పరీక్షగా మారనుంది. రాష్ట్రంలో త్వరలో ఖాళీ కానున్న మూడు రాజ్యసభ స్థానాలకు సంబంధించి అధికార, ప్రతిపక్షాల మధ్య కొత్త రాజకీయం మొదలైంది. వైసీపీ నుంచి వేమిరెడ్డి, బీజేపీ నుంచి సీఎం రమేష్, టీడీపీ నుంచి కనకమేడల రవీంద్ర కుమార్ పదవీ కాలం ముగియనుంది.

సార్వత్రిక ఎన్నికలకు ముందే ప్రస్తుత అసెంబ్లీ సంఖ్యా బలం ఆధారంగానే ఏపీ నుంచి ఈ మూడు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అసెంబ్లీ బలాలకు అనుగుణంగా ఈ మూడు స్థానాలు వైసీపీకి దక్కనున్నాయి. ఫలితంగా ఏపీకి రాజ్యసభలో ప్రాతినిధ్యం ఉన్న 11 స్థానాలు వైసీపీ ఖాతాలో జమ కానున్నాయి. దీంతో, టీడీపీ రాజ్యసభలో జీరో కానుంది. ప్రాతినిధ్యం కోల్పోతోంది.
జగన్ కు అరుదైన అవకాశం: ఈ అరుదైన అవకాశం సద్వినియోగం చేసుకోవాలని సీఎం జగన్ భావిస్తున్నారు. నెంబర్ కూడా వైసీపీకే అనుకూలంగా ఉంది. అయితే, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో చోటు చేసుకున్న పరిణామాలతో జగన్ అలర్ట్ అయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు టీడీపీ అభ్యర్దికి అనుకూలంగా ఓటింగ్ చేసారు.
ఫలితంగా టీడీపీ నుంచి ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ గెలుపొందారు. దీంతో, పార్టీ మారిన నలుగురు ఎమ్మెల్యేలపైన వైసీపీ అనర్హత వేటుకు సిద్దమైంది. అదే సమయంలో సీట్ల రాని ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకొని రాజ్యసభ బరిలో నిలవాలనేది టీడీపీ ప్లాన్ గా తెలుస్తోంది. మూడు రాజ్యసభ సీట్లకు ఎన్నిక జరగనుండటంతో ఒక్కో అభ్యర్ది గెలుపుకు దాదాపుగా 58 మంది సభ్యుల మద్దతు అవసరం ఉంటుంది.
టీడీపీ కౌంటర్ స్కెచ్: టీడీపీకి ప్రస్తుతం 19 మంది, వైసీపీ నుంచి వచ్చిన నలుగురితో 23 మంది బలం ఉంది. వైసీపీలో సీట్ల నిరాకరణ..అభ్యర్దుల మార్పు ద్వారా తమ వైపు వచ్చే వారి సంఖ్య పెరుగుతుందని అంచనా వేస్తోంది. టికెట్లు నిరాకరించిన ఎమ్మెల్యేల్లో అధికులు రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీకి అభ్యర్థికి క్రాస్ ఓట్ చేస్తే ఆ పార్టీ ఒక సీటును సునాయాసంగా గెలుచుకునే పరిస్థితి ఉంటుందని లెక్కలు వేస్తోంది.
అయితే, ఈ సారి టీడీపీ రాజ్యసభ ఎన్నికల్లో పోటీకి దిగి..ఓటింగ్ అనివార్యమైతే రెండో ప్రాధాన్యత ఓటింగ్ కీలకం అయ్యేలా వైసీపీ వ్యూహ రచన చేస్తోంది. అదే జరిగితే టీడీపీ అభ్యర్ది గెలిచే అవకాశం ఉండదు. దీంతో, ఎన్నికల వేళ రాజ్యసభలో టీడీపీకి ప్రాతినిధ్యం ఉండదు. మొత్తం ఏపీ నుంచి అన్ని స్థానాల్లోనూ వైసీపీ సభ్యులే ఉండనున్నారు. ప్రస్తుత సభ్యులు ఎరవైనా రాజీనామా లేదా, 2026లో మరోసారి ఖాళీల సమయంలోనే టీడీపీకి పెద్దల సభలో అవకాశం దక్కే పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో. రాజ్యసభ ఎన్నికల వేళ ఏం జరుగుతుందనే ఉత్కంఠ కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications