ఇబ్బందే, కానీ...: టిడిపిలో ఆది చేరికపై రామసుబ్బారెడ్డి
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ జమ్మలమడుగు శాసనసభ్యుడు ఆదినారాయణ రెడ్డిని పార్టీలో చేర్చుకోవాలనే పార్టీ అధ్యక్షుడు, ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నిర్ణయం పట్ల ఆ నియోజవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జీ రామసుబ్బారెడ్డి అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.
ఆదినారాయణ రెడ్డిని పార్టీలో చేర్చుకోవాలనే నిర్ణయాన్ని ఆయన వ్యతిరేకిస్తున్నప్పటికీ తప్పదనే పద్ధతిలో ఉన్నట్లు ఆయన మాటలను బట్టి అర్థమవుతోంది. చంద్రబాబు నిర్ణయం తీసుకున్న తర్వాత తానేమీ చేయలేననే ఉద్దేశాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఆదినారాయణ రెడ్డిని చేర్చుకోవడం వల్ల సంభవించే పరిణామాలపై తాను అధిష్టానానికి వివరించానని ఆయన సోమవారంనాడు చెప్పారు.
Also Read: ఎక్కువ కష్టాలొచ్చాయి: హోటల్లో భేటీపై బాబు ఆవేదన, ఢిల్లీకి జగన్
నియోజకవర్గం పార్టీ కార్యకర్తలు, నాయకులు పదేళ్ల పాటు అన్ని రకాల కష్టనష్టాలకు ఓర్చి పార్టీని నిలబెట్టారని, అది తన ఒక్కడి అభిప్రాయం మాత్రేమే కాదని, ప్రతి కార్యకర్తా నాయకుడూ అదే అబిప్రాయంతో ఉన్నాడని ఆయన చెప్పారు. తన చిన్నాన్న శివారెడ్డి టిడిపి నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారని, ఓసారి మంత్రిగా కూడా పనిచేశారని ఆయన చెప్పారు.

శివారెడ్డి మరణం తర్వాత కుటుంబ సభ్యులు, కార్యకర్తల కోరిక మేరకు తాను పార్టీలోకి వచ్చానని, రెండుమార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేశానని ఆయన చెప్పారు. ఎన్టీరామారావు, చంద్రబాబు అంటే తనకూ కార్యకర్తలకూ నాయకులకూ గౌరవం ఉందని ఆయన చెప్పారు. చంద్రబాబు నాయకత్వం మీద తనకు విశ్వాసం ఉదని చెప్పారు.
దశాబ్దాలుగా ఏర్పడిన గ్రూపులు గ్రామ స్థాయిలో కలవాలంటే అంత సులభం కాదని ఆయన అన్నారు. రాష్ట్ర రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకోవాలని పార్టీ అధిష్టానం అనుకుంటోందని, అందుకు పార్టీ నాయకులూ కార్యకర్తల అభిప్రాయం తెలుసుకోవాలని ఆయన అన్నారు. ఆదినారాయణ రెడ్డిని చేర్చుకోవడాన్ని కార్యకర్తలు అంగీకరించడం కష్టమని ఆయన అన్నారు.
తాము చంద్రబాబు మాటలకు గౌరవం ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఉన్నామని, అయితే ఆదినారాయణ రెడ్డిని చేర్చుకున్న తర్వాత ఫలితాలు ఎలా ఉంటాయనేది చూడాల్సిందేనని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications