చంద్రబాబుకు రతన్ టాటా ప్రశంస: 264 గ్రామాల దత్తత, పారిశ్రామికాభివృద్ధికి సహకారం
విజయవాడ: టాటా గ్రూప్ సంస్థల ఎమిరైటీస్ ఛైర్మన్ రతన్ టాటా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై ప్రశంసల వర్షం కురిపించారు. పారిశ్రామికవేత్తల భేటీలో భాగంగా సోమవారం విజయవాడకు వచ్చిన రతన్ టాటాకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఘన స్వాగతం పలికారు.
ఈ సమావేశంలో రతన్ టాటా మాట్లాడుతూ.. ఏపిలో పరిశ్రమల అభివృద్ధికి చంద్రబాబు కృషి ప్రశంసనీయమని అన్నారు. బాబు నేతృత్వంలో ఏపి అభివృద్ధి దిశగా పయనిస్తుందని ఆకాంక్షించారు.
స్వయం కృషితో దేన్నైనా సాధించే వ్యక్తి చంద్రబాబు అని ఆయన కొనియాడారు. రాష్ట్రంలో ఫిషరీస్, ఆక్వా రంగాల్లో టాటా గ్రూప్ సహకరిస్తుందని చెప్పారు. ఇతర రంగాల్లోనూ టాటా గ్రూప్ ఏపికి సహకరిస్తుందని రతన్ టాటా అన్నారు.
రతన్ టాటా రావడం సంతోషకరం: బాబు

రతన్ టాటా విజయవాడకు రావడం సంతోషకరమైన విషయమని ఏపి సిఎం చంద్రబాబునాయుడు అన్నారు. టాటా వచ్చారంటే ఇక్కడ పెట్టుబడులకు అనుకూల వాతావరణం వచ్చినట్లేనని చెప్పారు. విశాఖ, చిత్తూరులకు కూడా టాటా రావాలని చంద్రబాబు ఆకాంక్షిచారు.
ఆక్వా, ఫిషరీస్, ఆటోమొబైల్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో టాటా గ్రూప్ ప్రోత్సాహం కావాలని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో 24గంటల విద్యుత్, సింగిల్ డెస్క్ అనుమతులు, నీరు, భూమి ఆకర్షణీయ అంశాలని చంద్రబాబు తెలిపారు.
విజయవాడ పార్లమెంటు నియోజకవర్గంలో 264 గ్రామాలను టాటా గ్రూప్ దత్తత తీసుకోవడం సంతోషించాల్సిన విషయమని అన్నారు. ఇది దేశ పారిశ్రామిక వేత్తల చరిత్రలోనే విశేషమని అన్నారు. దేశంలోని పారిశ్రామికవేత్తలకు రతన్ టాటా ఆదర్శమని అన్నారు.
సీఎస్ఆర్ కింద గ్రామదత్తత విజయవాడ నుంచి ప్రారంభం కావడం విశేషమని తెలిపారు. ఖనిజాధారిత పరిశ్రమలు కూడా రాష్ట్రంలో టాటా గ్రూప్ పెట్టాలని చంద్రబాబు కోరారు. రాష్ట్ర అభివృద్ధికి రతన్ టాటా లాంటి వ్యక్తుల సూచనలు, సలహాలు అవసరమని చెప్పారు. రాష్ట్రంలో ఇంటింటికీ ఒక కంప్యూటర్ లిటరేట్ తయారవ్వాలని సిఎం ఆకాంక్షించారు.












Click it and Unblock the Notifications